సెమీకండక్టర్ హబ్‌గా భారత్

– సెమికాన్ 2.0తో తెలంగాణ యువతకు మంచి అవకాశం
– ఐఐటీ హైదరాబాద్ సహా 27 సాంకేతిక సంస్థల్లో సెమీకండక్టర్ డిజైనింగ్‌కు ప్రోత్సాహం
– సరికొత్త మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్‌తో భాగ్యనగరానికి విస్తృతావకాశాలు
– మన ఎగుమతుల రంగాల్లో ముందు వరుసలో మొబైల్ తయారీ రంగం

న్యూదిల్లీ, జూలై 17 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత్‌ను ప్రపంచ సెమీ కండక్టర్ శక్తిగా తీర్చిదిద్దే దిశగా కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. రూ.1,27,500 కోట్ల వ్యయంతో 12 సంవత్సరాల కాల వ్యవధితో చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమం ‘సెమికాన్ 2.0స. ఈ పథకం ద్వారా అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా సప్లయ్ చైన్‌లో ఇబ్బందులు, పెరుగుతున్న సాంకేతికంగా దేశాల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో భారత దేశాన్ని ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు రూ.62,500 కోట్లతో తీసుకొచ్చిన మొబైల్ ఫోన్ మాన్యుఫ్యార్చరింగ్ స్కీమ్(ఎంపీఎంఎస్) కూడా దేశ మొబైల్ తయారీ రంగంలో ఒక కొత్త విప్లవానికి బాటలు వేయనుంది. మొత్తంగా రూ.1.9 లక్షల కోట్లతో మొబైల్, సెమీకండక్టర్ రంగం అభివృద్ధికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పీఎల్‌ఐతో మారిన ముఖచిత్రం

మోదీ ప్రభుత్వం అమలు చేసిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) కారణంగా 2014-15లో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న మన దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ విలువ 2025-26 నాటికి రూ.13 లక్షల కోట్లకు పెరిగింది. దీంతోపాటు ఎగుమతులు రూ.38 వేల కోట్ల నుంచి రూ.3.3 లక్షల కోట్లకు, మొబైల్ ఫోన్ తయారీ రూ.18 వేల కోట్ల నుంచి రూ.5.45 లక్షల కోట్లకు, మొబైల్ ఎగుమతులు రూ.1,500 కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు పెరిగాయి. 2014కు ముందు 90%గా ఉన్న మొబైల్ ఫోన్ల దిగుమతులు దాదాపు సున్నా శాతానికి చేరుకోవడం దేశ పారిశ్రామిక పురోగతికి, కేంద్ర ప్రభుత్వ దీర్ఘదృష్టి నిర్ణయాలకు ఒక స్పష్టమైన ఉదాహరణ. ఇవాళ దేశంలో అత్యధికంగా విదేశాలకు ఎగమతులు చేస్తున్న అన్ని రంగాలతో పోల్చి చూసినట్లయితే మొబైల్ తయారీ రంగం మూడోస్థానంలో ఉంది. సెమికాన్ ప్రాజెక్టు 1.0 కింద కేంద్ర ప్రభుత్వం రేపటి ప్రపంచానికి అవసరమైన నైపుణ్యతతో కూడిన యువతను సిద్ధం చేసేందుకు 315 విశ్వవిద్యాలయాల్లో 68 వేల మంది విద్యార్థులకు అత్యాధునిక ఎలక్ట్రానిక్ డిజైన్ అటొమేషన్ (ఈడీఏ టూల్స్)తో ఆధునిక సాంకేతికతతో కూడిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందించింది. ఇందులో తెలంగాణ  నుంచి ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నిట్ వరంగల్, జేఎన్‌టీయÖ హైదరాబాద్, బిట్స్ హైదరాబాద్, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ సహా మొత్తం 27 విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలున్నాయి. దీంతోపాటు దేశవ్యాప్తంగా 105 స్టార్టప్‌లు చిప్ డిజైన్‌లో పనిచేస్తున్నాయి. ఈ స్టార్టప్‌లు, ఎంఎసఎంఈలు శాటిలైట్ కమ్యూనికేషన్స్, డ్రోన్స్, నిఘా కెమెరాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఎల్ఈడీ డ్రైవర్లు, ఏఐ పరికరాలు, టెలికాం పరికరాలు, స్మార్ట్ మీటర్లు వంటి వాటిలో ఉపయోగించే సెమీకండక్టర్ చిప్స్‌ను తయారు చేస్తాయి.

తెలంగాణలో ఈఎంసీలకు కేంద్రం ప్రోత్సాహం

ఈ-సిటీ, ఫ్యాబ్ సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ఫీల్డ్ ఈఎంసీ ప్రాజెక్టు కోసం రూ.252 కోట్లుల్ణ, మహేశ్వరం, గ్రీన్‌ఫీల్డ్ ఈఎంసీ ప్రాజెక్టు కోసం రూ.139 కోట్లు, హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్‌కు రూ.75 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందించింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటు చేయనున్న ఈఎంసీ ప్రాజెక్టు కోసం రూ.258 కోట్లను కేంద్ర ప్రభుత్వమే అందించింది. తెలంగాణలో ఈఎంసీల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.724 కోట్ల ఆర్థిక సాయం అందించింది. సెమికాన్ 2.0లో చిప్ డిజైన్, మెషీన్స్, మెటీరియల్స్, మరిన్ని సిలికాన్/కాంపౌండ్, సెమీకండక్టర్/డిస్‌ప్లే ఫ్యాబ్స్ ఏర్పాటు, ఎటీఎంపీ(సెమీకండక్టర్స్ అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకింగ్I ఔట్ సోర్స్‌డ్ సెమీకండక్టర్స్ అసెంబ్లీ అండ్ టెస్ట్) పరిశ్రమల విస్తరణ, అధునాతన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్), టాలెంట్ డెవలప్‌మెంట్ అనే ఆరు ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. 2028లో తొలి సిలికాన్ ఫ్యాబ్ ప్రారంభం కానుండగా భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ, డిజైన్ హబ్‌గా నిలబెట్టేందుకు ఈ సెమికాన్ 2.0 పథకం భారత్‌లో కీలక పాత్ర పోషించనుంది. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ రంగంలో జరుగుతున్న మార్పులను తెలంగాణకు అవకాశాలుగా మలుచుకునేందుకు ఇదే సరైన సమయం. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, వ్యాక్సిన్, హెల్త్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ రంగాలకు దేశంలో ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెమికాన్ 2.0తో తెలంగాణకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలోని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు రూ.1,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు అందించింది. ఇప్పుడు సెమికాన్ 2.0 ద్వారా వచ్చే వచ్చే అవకాశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని సెమీకండక్టర్ తయారీ, ఏటీఎంపీ యూనిట్లు, డిజైన్ సెంటర్లు, పరిశోధనా సంస్థలను ఆకర్షించేందుకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించాలి. సెమికాన్ 2.0తో పాటు రూ.62,500 కోట్లతో మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్(ఎంపీఎంఎస్)కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు అమలయ్యే ఈ పథకం ద్వారా దేశంలో మొబైల్ ఫోన్స్ తయారీని మరింత విస్తరించడం, దేశీయంగా వాల్యూ యాడెడ్ ప్రొడక్షన్ పెంచడం, సప్లయ్ చైన్‌ను బలోపేతం చేయడం, భారతీయ బ్రాండ్లను ప్రపంచస్థాయికి మరింతగా తీసుకెళ్లడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద మొబైల్ ఫోన్ తయారీపై 2.25% నుంచి 5% వరకు ప్రోత్సాహకం, దేశీయంగా కీలక విడిభాగాల కొనుగోలుపై అదనంగా 1.5%, భారతీయ బ్రాండ్ల డిజైన్, రీసర్చ్, డెవలప్‌మెంట్ కోసం మరో 3% అదనపు ప్రోత్సాహకం అందించనున్నారు. రానున్న ఐదేళ్లలో దేశంలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి జరిగే అవకాశం ఉండగా సుమారు 60 వేల ప్రత్యక్ష ఉపాధి కల్పన జరగనుంది. ఇది దేశ మొబైల్ తయారీ రంగంతోపాటు తెలంగాణలో మొబైల్ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే మొబైల్ తయారీ రంగం ద్వారా దేశంలో 25 లక్షల మందికి ఉపాధి లభిస్తుండటం సంతోషించాల్సిన విషయం. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి మోదీ మేక్ ఇన్ ఇండియా విజన్ కారణంగా 2014-15తో పోలిస్తే ఎలక్ట్రానిక్స్ తయారీ ఏడు రెట్లు, ఎగుమతులు 11 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా నిలిచింది. దేశంలో వినియోగిస్తున్న 99.2% మొబైల్ ఫోన్లు మేకిన్ ఇండియా స్ఫూర్తితో భారత్‌లోనే తయారవుతున్నాయి. 2025లో స్మార్ట్‌ఫోన్లు ప్రపంచంలో భారత్ నుంచే అత్యధికంగా ఎగుమతి అయ్యాయి. ఈ పథకం లబ్ధిని తెలంగాణ పెద్దమొత్తంలో సద్వినియోగం చేసుకోవాలి. మొబైల్ ఫోన్ తయారీ, కంపోనెంట్ తయారీ, డిజైన్, ఆర్ అండ్ డీ కేంద్రాలు తెలంగాణలో స్థాపించే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ (ఈఎంసీ)లు, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈఎస్‌డీఎం) ఎకోసిస్టమ్, టీIహబ్, ఐఐటీ-హైదరాబాద్‌లో ఉండటంతో వాటి సహకారంతో ఏర్పడే నూతన సంస్థలకు మరింత బలం చేకూరుతుంది. తెలంగాణ యువతకు కూడా ఇదొక సువర్ణావకాశం. చిప్ డిజైన్, సెమీకండక్టర్ తయారీ, క్లీన్‌రూమ్ టెక్నాలజీ, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ వంటి యువత ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకుని ప్రపంచస్థాయి ఉద్యోగాలు, స్టార్టప్ అవకాశాలను అందుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. వికసిత భారత్-2047 లక్ష్య సాధనలో మన దేశం ఈ రంగంలో మరింత దూసుకుపోయే విధంగా మన దేశ యువశక్తి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *