3,4 తేదీల్లో ‘టవర్స్‌’ ఇండ్ల కేటాయింపు

– యూట్యూబ్‌లో ఈ-లాటరీ ప్రత్యక్ష ప్రసారం
– హౌసింగ్ బోర్డు వైస్ చైౖర్మన్ గౌతం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 31 : ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఫ్లాట్ల కోసం దరఖాస్తులు స్వీకరించి లబ్దిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన లాటరీ ప్రక్రియను నవంబర్ 3న నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైౖర్మన్ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో 16 నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా కేటాయించిన ఇండ్లలో వివిధ కారణాలతో కేటాయింపు రద్దు కావడంతో అందుబాటులోకొచ్చిన ఇండ్లను కూడా లబ్దిదారులకు కేటాయించనున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మాప్ అప్ లాటరీ ప్రక్రియను నవంబరు 4న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఈ-లాటరీ ద్వారా నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని తెలిపారు. ముషీరాబాద్, ఎల్.బి.నగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లో ప్రతిపాదించిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఫ్లాట్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన పూర్తయి లాటరీ ప్రక్రియ ద్వారా లబ్దిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంది. ఈ లాటరీ ప్రక్రియను హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన యూట్యూబ్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు.

4న మాప్-అప్ లాటరీ

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతగా అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ(కంటోన్మెంట్ మినహా) 480 ఇండ్ల నిర్మాణాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 16 నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారి జాబితాతో ఆయా నియోజకవర్గాల్లోనే లాటరీ నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేశారు. పలు ప్రాంతాల్లో టవర్స్ నిర్మాణ పనులు కూడా ప్రారంభమై పురోగతిలో ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయి పరిశీనల్లో లాటరీలో ఎంపికైన వారిలో కొంతమంది ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం నివాసం ఉండకపోవడం, కొందరు తాము ప్రస్తుతం డబ్బులు చెల్లించలేమని పేర్కొనడం, ఇప్పటికే సొంత ఇల్లు ఉండటం తదితర కారణాలతో లాటరీలో ఇండ్లు వచ్చినప్పటికీ అనర్హులయ్యారు. ఇలా ఖాళీలు ఏర్పడి కొత్త వారి కోసం అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇండ్లను ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి జాబితా నుంచే అర్హులైన వారికి కేటాయించడానికి ఆన్‌లైన్ ద్వారా నవంబరు 4న ఈ-లాటరీ నిర్వహిస్తున్నట్లు గౌతం వివరించారు.

చిరునామా ఆధారంగా నియోజకవర్గాల మార్పు

కాగా, 16 నియోజకవర్గాల్లో కొంతమంది తాము ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గంలో కాక ఇతర నియోజకవర్గాల్లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అలాంటి వారి పేర్లు గతంలో నిర్వహించిన లాటరీలో చేర్చలేదని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దరఖాస్తుదారులు సమర్పించిన చిరునామాల ఆధారంగా, గూగుల్ ద్వారా వారు ఏ నియోజకవర్గం పరిథిలోకి వస్తారన్నది తెలుసుకున్నామన్నారు. ఆ సమాచారం ఆధారంగా వారి పేర్లను ఖాళీల భర్తీ కోసం నిర్వహించే లాటరీలో సుమోటోగా చేరుస్తున్నామన్నారు. ఏ నియోజకవర్గంలోని వారికి ఆ నియోజకవర్గంలోనే సొంత ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా దరఖాస్తుదారుల చిరునామాలకు జియోకోడ్స్ సేకరించి గూగుల్ మ్యాప్‌లతో వారి చిరునామాలను అనుసంధానించుకుంటూ మ్యాపింగ్ చేశామన్నారు. గతంలో దరఖాస్తుదారులు వివరాల నమోదులో పొరపాటు చేసినప్పటికీ ప్రభుత్వపరంగా దానికి పరిష్కారం కనుగొని అర్హులైన అందరికీ అవకాశం కల్పిస్తున్నామన్నారు. నియోజకవర్గ మార్పు కోసం దరఖాస్తుదారులు చేసుకున్న విజ్ఞప్తులను కూడా పరిష్కరించామని వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *