– అధికార్లకు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: రాష్ట్రం నీట్-2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సచివాలయం నుండి అదనపు డిజిపి మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సిపిలు, ఇతర అధికారులతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీట్-2026 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21న జరగనున్న నీట్-2026 పరీక్షకు 24 పట్టణాలలో 208 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 72 వేల 956 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర, జిల్లా సమన్వయ కమిటీలు అందుకు అనుగుణంగా పని చేయాలని తెలిపారు. ప్రభుత్వ సంస్థలలో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ యోగా దినోత్సవం దృష్ట్యా పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు పరీక్షకు చేపట్టిన ఏర్పాట్లపై సమావేశాంలో వివరించారు. అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ మాట్లాడుతూ, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. జాతీయ పరీక్షా సంస్థ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఏడాది పరీక్షల కోసం మరింత కట్టుదిట్టమైన భద్రతా విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా ప్రశ్నాపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళం సేవలను వినియోగిస్తున్నామన్నారు.
వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష
రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల పాటు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. కోత పూర్తయిన ధాన్యాన్ని రక్షించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇంకా ధాన్యం నిల్వ ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి, ఇప్పటి వరకు 10 లక్షల 58 వేల మంది రైతుల ఖాతాలలో 13 వేల 577 కోట్ల రూపాయల కనీస మద్దతు ధర జమ చేశామన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేపట్టనున్న పర్యటనల ఏర్పాట్లను కూడా ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రతి మండల మహిళా సమాఖ్యకు 1 చొప్పున 553 బస్సులను మంజూరు చేశామని, ఈ బస్సులను జూన్ 9వ తేదీన సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సమాఖ్య సభ్యులకు లాంఛనంగా అందజేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ సీవీ ఆనంద్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానా కిషోర్, జీహెచఎంసీ కమిషనర్ కర్ణన్, సీఈఓ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
——————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





