రేవంత్- అసదుద్దీన్ ఫార్ములా

– ఉత్తరాది, దక్షిణాది పేరుతో విషం చిమ్ముతున్నారు
– కాంగ్రెస్, బిఆర్ఎస్ ల తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  డీలిమిటేష‌న్ వ‌ల్ల‌ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, సీట్లు తగ్గుతాయని.. దక్షిణాదికి, ఉత్తరాదికి యుద్ధం వస్తుందని విపక్ష పార్టీలు మాట్లాడ‌డంపై  కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దిల్లీలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రానికీ ఎలాంటి అన్యాయం జరగదని లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, హోంమంత్రి చాలా స్పష్టమైన సందేశాన్నిచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు జరిగిన పునర్విభజన తీరులో కాకుండా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసే విధంగా అందరికీ అనుకూలమైన, ఆమోదయోగ్యమైన బిల్లును తీసుకొస్తున్నామన్నారు. దక్షిణాదిలో సీట్లు తగ్గకుండా ప్రజల సెంటిమెంటును మోదీ ప్రభుత్వం గుర్తించి 50% పెంపు ఫార్ములా తీసుకొచ్చినప్పటికీ విపక్షాలకు సంతృప్తి కలగలేదన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లో కొత్త నాయకత్వం వస్తుందనే భయం విపక్షాల్లో ఉందని అన్నారు. అదే జరిగితే కుటుంబాల చేతుల్లో ఉన్న పార్టీల నాయకులకు వారి ప్రాబల్యం తగ్గుతుందనే భయం నెలకొందని వ్యాఖ్యానించారు. బలహీనవర్గాలకు అధికారం దక్కొద్దనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఉండొద్దనేది మజ్లిస్ పార్టీ కుట్ర అన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే కొత్త సమస్యలు వస్తాయని మజ్లిస్ నాయకులు, అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడినవి అసెంబ్లీ రికార్డులో ఉన్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సీట్ల పునర్విభజన జరిగితే తమకు ఎక్కడ ముప్పువస్తుందోననే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీని కలిపి కుట్రలు చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా.. మజ్లిస్, కాంగ్రెస్ హైబ్రిడ్ ఫార్ములా. ఈ ఫార్ములాను మజ్లిస్ తయారు చేసింది.. అందుకే నిన్న అసదుద్దీన్ కూడా పార్లమెంటులో రేవంత్ రెడ్డి ఫార్ములాను ప్రశంసించారన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలనుంచి 70% రెవెన్యూ వస్తోందని, మిగిలిన జిల్లాలకు కోతపెట్టి హైదరాబాద్, రంగారెడ్డిల్లోనే సీట్లు పెంచాలని రేవంత్, అసదుద్దీన్, కేటీఆర్ కోరుతున్నారా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మిగిలిన జిల్లాల్లో సీట్లు పెరగాల్సిన అవసరం లేదా అనేది ఈ ముగ్గురూ సమాధానం చెప్పాలని నిలదీశారు. మేం ఎక్కువ పన్ను కడుతున్నాం మాకు రిజర్వేషన్ ఉండాలని ఎవరైనా భూస్వాములు, కార్పొరేట్ అధినేతలు డిమాండ్ చేయవచ్చా.. మాకు రిజర్వేషన్స్ కావాలని అడగొచ్చా అని అడిగారు.

ఒక్క ముస్లిం మహిళా కార్పొరేటర్ పేరు చెప్పగలరా

మజ్లిస్ పార్టీ మహిళల హక్కులకు వ్యతిరేకమైన పార్టీ. మహిళలకు ఎటువంటి అధికారాలు, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దక్కకూడదని కుట్రలు చేస్తున్న పార్టీ అని ఆరోపించారు. హైదరాబాద్ పాత బస్తీలో మహిళల జనాభా ఎక్కువ. అందుకే ఆ ప్రాంతాల్లో రిజర్వేషన్ మహిళలకు వస్తుందేమోనన్న కుట్రతో, అక్కసుతో రిజర్వేషన్లను మజ్లిస్ వ్యతిరేకిస్తోందన్నారు. జీహెచ్ ఎంసీలో ఒక్క ముస్లిం మహిళా కార్పొరేటర్ పేరు ఎవరైనా చెప్పగలరా అని అడిగారు. రిజర్వేషన్ సీట్లలో ముస్లిం మహిళలు కార్పొరేటర్‌గా గెలిచినా వారికి ఎటువంటి హక్కులు దక్కనీయదు అని కిషన్‌రెడ్డి అన్నారు. మోదీ ఫార్ములాతో దక్షిణాదికి న్యాయమా.. అన్యాయమా అనే దానిపై బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నానన్నారు. అయితే వితండవాదం లేకుండా చర్చకు రావాలన్నారు. ఉత్తర భారత దేశంలో జనాభా పెరిగినప్పటికీ దక్షిణాదిన జనాభా తగ్గినప్పటికీ అన్ని రాష్ట్రాలకు సమాన నిష్పత్తిలో సీట్లు పెరిగేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సర్వసమాన న్యాయంతో మోదీ ఫార్ములా సిద్ధం చేశారని ఆయన తెలిపారు. దక్షిణాదికి చెందిన పార్టీలు, ఆయా పార్టీల నాయకులు మోదీకి ధన్యవాదాలు చెప్పాలి.. కొత్త ఫార్ములాను స్వాగతించాలి.. వాళ్ల పార్టీ కార్యాలయాల్లో మోదీ ఫోటో పెట్టుకోవాలి.. అని అన్నారు. ఏపీ విభజన బిల్లులో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153 స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచాలని పేర్కొన్నారు కదా. మరి దీనికి ఏ ఫార్ములా అనుసరించారో కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *