– జూలై నాటికి సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాల పూర్తి
– సెప్టెంబర్ 2026 నాటికి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం
– నవంబర్-డిసెంబర్‌లో పునరుద్ధరణ పనులు ప్రారంభం
– రైతుల ప్రయోజనాలు, ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
– నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మేడిగడ్డ, ప్రజాతంత్ర, జూన్ 10: మేడిగడ్డ బ్యారేజీతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యంత శాస్త్రీయ పద్ధతిలో చేపట్టి 2027 వేసవి నాటికి పూర్తిచేసి తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న సాంకేతిక పరిశోధనలు, హైడ్రాలజికల్ అధ్యయనాలు, జియోటెక్నికల్ పరీక్షలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సర్వేలు, పునరుద్ధరణ ప్రణాళికల పురోగతిని బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై తొలి వారానికి అన్ని సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాలు పూర్తవుతాయని, అనంతరం సేకరించిన నివేదికలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎసఏ)లకు పంపుతామని తెలిపారు. వాటి సూచనల మేరకు 2026 సెప్టెంబర్ నాటికి పునరుద్ధరణ డిజైన్లను ఖరారు చేస్తామనిరు. వర్షాకాలం ముగిసిన వెంటనే 2026 నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ తొలి వారంలో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని, ఒకే పని సీజన్‌లో పనులు పూర్తి చేసి 2027 వేసవి నాటికి బ్యారేజీలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. హైడ్రాలజికల్ అధ్యయనాలతోపాటు జియోటెక్నికల్ బోర్‌హోల్ పరిశోధనలు, ఇతర సాంకేతిక పరీక్షలను వేగవంతం చేశామని తెలిపారు. ప్రస్తుతం మూడు బ్యారేజీల్లో జీపీఆర్ పరీక్షలు 90 శాతం పూర్తయ్యాయని, బోర్‌హోల్, జియోటెక్నికల్ పరిశోధనలు 80 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. జూన్ చివరి నాటికి అన్ని పరీక్షలు, పరిశోధనలు పూర్తవుతాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ తరహా నష్టం పునరావృతం కాకుండా ఉండేందుకు 40 నుంచి 80 మీటర్ల లోతు వరకు బోర్‌హోల్స్ తవ్వి భూగర్భ పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. కేంద్ర జల సంఘం, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థల ఆమోదం వచ్చిన తర్వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలు, ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు
గత పాలకుల నిర్ణయాలే ముంచాయి
బీఆర్ఎస్ పాలకుల తప్పుడు నిర్ణయాలు, లోపభూయి
ష్ట విధానాలు, నిర్మాణ లోపాల కారణంగానే మేడిగడ్డతోపాటు ఇతర బ్యారేజీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. 2023 అక్టోబర్‌లో జరిగిన నష్టం గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, అనంతరం నిర్వహించిన విచారణల్లో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ, న్యాయ కమిషన్‌లు పలు నిర్మాణ, డిజైన్, నిర్వహణ లోపాలను గుర్తించాయి’ అని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38వేల కోట్ల అంచనా వ్యయంతో డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించిందని గుర్తు చేశారు. 2014 నాటికే దాదాపు మూడోవంతు పనులు పూర్తయ్యాయని చెప్పారు. అదే ప్రాజెక్టును కొనసాగించి ఉంటే 2016-17 నాటికే పూర్తై సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచిందని విమర్శించారు. రూ.38వేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.లక్ష కోట్లు దాటిందని, ‘కాగ్’ అంచనాల ప్రకారం అది రూ.1.45 లక్షల కోట్ల వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఇంత భారీ ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ 2023 డిసెంబర్ 7 తర్వాత మూడు బ్యారేజీలు వినియోగంలో లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన పరిణామంగా ఆయన అభివర్ణించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలపై, రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిిందంటూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించిందని పేర్కొన్నారు. పునరుద్ధరణ డిజైన్ల కోసం ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టెంట్ సంస్థ ఏఎఫఆర్‌వైను ఐఐటీ ముంuయితో కలిసి నియమించామని తెలిపారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నమూనా అధ్యయనాలు, సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తోందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఎన్‌డీఎస్‌ఏ గుర్తించిన స్కౌర్ డెప్త్, కట్-ఆఫ్ డెప్త్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, ఎనర్జీ డిసిపేషన్, గేట్ల నిర్వహణ వంటి కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





