కామాంధుడిని ర‌క్షించేందుకు రాజ‌కీయుల య‌త్నాలు

– కేసు న‌మోదు కాకుండా ప్ర‌య‌త్నం
– రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు లొంగ‌ని పోలీసులు
– నిందితుడిపై కేసు న‌మోదు

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 10 : సభ్య సమాజం తలదించుకునేలా ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక 12 ఏళ్ల మైనర్ బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించి, ఆ విషయం బయటకు వస్తుందనే భయంతో ఆమెను అపార్ట్‌మెంట్ ఐదో  అంతస్తు పైనుంచి కిందకు తోసేశాడు. దీంతో పేద బాలిక వెన్నెముక, పక్కటెముకలు విరిగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఈ హృదయ విదారక ఘటనలో నిందితుడిని కాపాడేందుకు రాజకీయ నాయకులు రంగంలోకి దిగడం అనేక అనుమానాలకు, విమర్శలకు తావిస్తోంది. సదరు నిందితుడు కార్ డ్రైవర్ అయిన మహ్మద్ గౌస్(57). బి(టి).ఆర్.ఎస్. తరుపున డివిజన్ లో ఓ పోలింగ్ బూత్ ఇన్‌చార్జి గా పని చేస్తున్నాడు. జూన్ ఆరవ తేదీన ఈ ఘోరం జరిగినా, ఆలస్యంగా బయటకు రావడానికి ప్రధాన కారణం ఏమిటనేది అంతుపట్టని విషయం, నిందితుడు ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, బాధితురాలి కుటుంబం  కూలి నాలి చేసుకుని బ్రతికే నిరుపేద  కుటుంబం కావడంతో స్థానిక రాజకీయ నాయకులు విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పాప ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు ముందుగా వైద్యంపైనే దృష్టి పెట్టారు.ఇదే అదనుగా తీసుకున్న కొందరు వ్యక్తులు కేసు నమోదు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపస్తున్నాయి . సాధారణంగా పైనుంచి పడిపోయిన ఘటనలు గానీ ఉద్దేశ్య పూర్వకంగా దాడి జరిగినప్పుడు గానీ మెడికో లీగల్ కేసు(ఎం ఎల్ సి) వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి. కానీ అలా చేస్తే ప్రభుత్వ వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు, తద్వారా కేసు పక్కాగా నమోదు అవుతుంది. దీన్ని నివారించడానికే, అత్యవసర వైద్యం పేరుతో పక్కా ప్రణాళికతో బాలికను బడా బి ఆర్ ఎస్ నేత ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టమవుతోంది. మెడికల్ రిపోర్టులను తారుమారు చేయడానికి లేదా డాక్టర్లను మేనేజ్ చేసి ‘ప్రమాదవశాత్తు పడిపోయింది’ అని క్రియేట్ చేయడానికి ఈ ఎత్తుగడ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాకుండా “రూ. 20 లక్షలు ఇప్పిస్తాం, సైలెంట్ గా కేసు ఉపసంహరించుకోండి అంటూ కొందరు వ్యక్తులు బాధితురాలి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడు గత ప్రభుత్వంలో ఉన్న బి ఆర్ ఎస్ కు  చెందినవాడైనప్పటికీ, ప్రస్తుత అధికార పార్టీ నేతలు అతనికి అండగా నిలవడం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయకుల మధ్య పైకి పార్టీల రంగులు ఉన్నా, చీకటి వ్యాపారాల్లో వారికి ఒకరికొకరు సహకరించుకునే ఒప్పందాలు ఉంటాయని స్థానికులు విమర్శిస్తున్నారు. డబ్బు, పలుకుబడి ముందు పార్టీ సిద్ధాంతాలు పక్కకు పోయాయని ఈ ఘటన నిరూపిస్తోంది. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు ఓ ప్రతి పక్ష మాజీ కార్పొరేటర్, అధికార పార్టీకి చెందిన ఒక మాజీ కార్పొరేటర్ ఏకంగా పోలీసులతోనే బేరసారాలకు దిగడం విశేషం. అంతేకాకుండా జూన్ 8వ తేదీ సాయంత్రం 6:00 గంటల నుంచి 8:00 గంటల వరకు నేరుగా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే బైఠాయించి, నిందితుడిపై కేసు నమోదు చేయొద్దంటూ పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ పోలీస్ స్టేషన్‌లో కూర్చుని రాజకీయంగా ఎంత ఒత్తిడి చేసినా, బెదిరింపులకు గురిచేసినా ఖమ్మం నగర పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చట్టం ముందు అంతా సమానులే అని నిరూపిస్తూ, రాజకీయ ఒత్తిళ్లను పక్కనపెట్టి నిందితుడిపై కఠినమైన పోక్సో, హత్యాయత్నం వంటి  సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

రెండో రోజూ నిరసనలు

సంఘటన పెద్దది కావడంతో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు బి.ఆర్.ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రం కావడం, సంఘటన పరిధి ఓ మంత్రి, బాలిక కుటుంబం మరో మంత్రి పరిధి లో ప్రత్యర్థి పార్టీ నేత ఇంత పెద్ద ఘాతుకానికి పాల్పడిన కాంగ్రెస్ ఆ స్థాయిలో ఎండ గట్టక పోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బి ఆర్ ఎస్, బీజేపీ, సీపీఎం, సిపిఐ ఇతర పార్టీలు, సంఘాల నేతలు బాధితులను పరామర్శించి దైర్యం చెప్పారు. మైనర్ బాలికపై హత్యాచారానికి పాల్పడి, సాక్ష్యాలు లేకుండా చేయడానికి పైనుంచి కిందకు తోసేసిన ఒక మానవ మృగాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన కొందరు అధికార పార్టీ నాయకులు, ఓ మాజీ బి ఆర్ ఎస్ కార్పొరేటర్‌ తీరుపై మహిళా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సదరు నిందితుడిపై గతంలోనూ కిడ్నా ప్, గొడవల కేసులు, రౌడీ షీటర్ ఉన్నాయని ఆరోపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, నిందితుడికి సహకరించి, బాధితులను ప్రలోభపెట్టాలని చూసిన మాజీ కార్పొరేటర్‌ లపై పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సంఘటనను నిరసిస్తూ రెండో రోజు బుధవారం కూడా ఖమ్మం నగరంలో కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న బాలిక ను పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పరామర్శించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరా రావు మెరుగైన వైద్యం అందించాలని నీమ్స్ ఆసుపత్రి బాద్యులకు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *