– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : రాజకీయాలు, ప్రజాసేవ పట్ల బాలికల్లో అవగాహన పెంపొందించడమే మాక్ అసెంబ్లీ నిర్వహణ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీ హాల్‌లోని పూర్వ శాసనమండలి భవనంలో బుధవారం నిర్వహించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపికైన కిశోర బాలికలు ప్రజాప్రతినిధుల పాత్రలో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించడం, అధికార, విపక్ష సభ్యులుగా వ్యవహరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లటి ఖాదీ దుస్తులు, కండువాలు ధరించి రాజకీయ నాయకులను తలపించేలా హాజరైన బాలికలు సభలో క్రమశిక్షణతో పాల్గొని తమ వాదనలను వినిపించారు. ఆరోగ్యం, విద్య, ఆదివాసీ సంక్షేమం, సోషల్ మీడియా ప్రభావం, యువత భవిష్యత్ వంటి పలు అంశాలపై చర్చలు జరిపారు. టీనేజ్ బాలికల స్నేహ సంఘాల ఆధ్వర్యంలో ముందుగా మండలస్థాయిలో, అనంతరం జిల్లాస్థాయిలో మాక్ అసెంబ్లీలు నిర్వహించగా అందులో ప్రతిభ కనబరిచిన బాలికలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క బాలికలను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీనేజ్ బాలికలకు ఇలాంటి వేదికలను కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభలో మాట్లాడిన బాలికలు ఆరోగ్యం, ఆదివాసీ సంక్షేమం, సోషల్ మీడియా ప్రభావం వంటి కీలక అంశాలను ప్రస్తావించడం అభినందనీయమన్నారు. రాజకీయాలంటే చాలామంది యువత వెనుకడుగు వేస్తారని, ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మారుమూల గ్రామాల నుంచి కూడా నాయకత్వం రావాలని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వారే సమర్థవంతంగా ప్రజల తరఫున మాట్లాడగలరని అన్నారు. చిన్న వయసులోనే బాలికలు ప్రదర్శించిన పరిణతి, అవగాహన తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. నాయకత్వం వహించాలంటే మంచి విద్య, నిరంతర అధ్యయనం, విజ్ఞానం అవసరమని చెప్పారు. జ్ఞానం పెరిగినకొద్దీ సమాజ సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుందన్నారు. కిశోర బాలికలు సమాజంలో గౌరవనీయ స్థానాలను అందుకోవాలని ఆకాంక్షించారు. మన మూలాలు గ్రామాల్లో ఉండొచ్చు. కానీ మన లక్ష్యాలు ప్రపంచాన్ని చేరుకోవాలి అని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇదే అసెంబ్లీ హాల్‌లో ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా, స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా మాట్లాడే స్థాయికి ఎదగాలని బాలికలను ఆశీర్వదించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





