– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026ను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఈ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లు, వివిధ కార్యక్రమాల పురోగతిపై సచివాలయంలో గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, కంపెనీలను ఆహ్వానించామని, ఇప్పటికే అనేక సంస్థలు తమ భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు. సమ్మిట్ నిర్వహణపై తాము ఆశించిన దానికంటే అధికంగా స్పందన లభిస్తోందన్నారు. ఈ సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్పో, స్టార్టప్ పెవిలియన్, క్రియేషన్ కార్నర్, ఫార్మా-లైఫ్ సైన్సెస్ ఎక్స్పో, తెలంగాణ పెవిలియన్, ఇండస్ట్రియల్ ఎక్స్పో, తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్, ఎడ్యుకేషన్ సమ్మిట్, ఏరోబాటిక్-ఎయిర్ షో తదితర ప్రత్యేక ప్రదర్శనలు, కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ముఖ్యంగా స్టార్టప్ పెవిలియన్, క్రియేషన్ కార్నర్ యువత, జెన్-జీలోని సృజనాత్మకత, ఆవిష్కరణలు, నూతన ఆలోచనలకు ప్రోత్సాహం అందించే వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. సమ్మిట్‌ను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, వ్యాపార అవకాశాలను జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు వివరించి వారిని ‘రైజింగ్ తెలంగాణ విజన్’లో భాగస్వాములను చేయడమే ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యమని సీఎస్ పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు దిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధుల కోసం డెలిగేట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రభుత్వ కార్యదర్శులు ఇలంబర్తి, హరిచందన, గౌరవ్ ఉప్పల్, దివ్య దేవరాజన్, శశాంక, అనుదీప్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





