టెలీమెడిసిన్ సేవలు విస్తరించాలి

– ఆదివాసి గిరిజన యువతకు స్థానికంగానే ప్రాథమిక వైద్య శిక్షణ
– ఎయిమ్స్ బీబీనగర్ బృందానికి మంత్రి సీతక్క అభినందనలు

బీబీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ సిబ్బంది ములుగు వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. వైద్య సేవల విస్తరణకు చొరవ తీసుకున్న ఎయిమ్స్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఎయిమ్స్‌ను మంగళవారం సందర్శించిన మంత్రి ములుగు జిల్లాలో వైద్య సేవల కల్పన, హాస్పిటల్స్ నిర్మాణంపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మతం, ప్రాంతం, కులం, తెగతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందడం హక్కు అని సీతక్క పేర్కొన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత కారణంగా ఆదివాసీ గిరిజనులకు ఆధునిక వైద్యం సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ వైద్యులు కొంతకాలమైనా ములుగు వంటి ప్రాంతాల్లో పనిచేసి ప్రజలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్, సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ములుగు జిల్లాలో గిరిజన ఆరోగ్య పరిరక్షణ, వైద్య శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. స్థానిక ఆదివాసీ యువతకు శిక్షణ ఇచ్చి, వారి ప్రాంతాల్లోనే ఆరోగ్య కార్యకర్తలుగా సేవలందించే అవకాశం కల్పించడం ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని చెప్పారు. ములుగు, ఏటూరునాగారంలలో తొలి దశలో శాటిలైట్ హెల్త్ సెంటర్లను ప్రారంభించాలని, టెలీమెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఎయిమ్స్ బృందాన్ని కోరారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రక్తహీనత, పోషకాహార లోపం, సికిల్ సెల్ వ్యాధి, మలేరియా వంటి సమస్యల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించారు. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో వైద్య సేవలందించే సమయంలో స్థానిక భాషలు, సంప్రదాయాలు, జీవన విధానాలను గౌరవించాలని వైద్యులకు సూచించారు. కోయ, గోండి, లంబాడీ భాషల్లో ఆరోగ్య అవగాహన కల్పించడం ప్రయోజనకరమన్నారు. ములుగు జిల్లా ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎయిమ్స్‌తో కలిసి పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. ములుగు జిల్లా ఆరోగ్య సంరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమితా అగర్వాల్, సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్, రీసెర్చ్ డీన్ డాక్టర్ రాహుల్ నారాక్, వివిధ విభాగాల డీన్లు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ రూపొందించిన ములుగు ఆరోగ్య వికాసం పుస్తకాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ములుగు ప్రాంతీయ సంరక్షణ కోసం ఎయిమ్స్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *