– కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షణ
– 22-ఏ సమస్యను ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని పనిచేయాలి
– అధికారులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా 22-ఎ అంశంపై రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని, కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి దరఖాస్తును ఫిర్యాదుగా కాక ఒక బాధ్యతగా తీసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిజమైన హక్కుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 22-ఏ ఫిర్యాదులకు సంబంధించి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు వస్తున్న కాల్స్, వాటి పరిష్కారం, ఏయే సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి, వచ్చిన కాల్స్‌కు ఎలాంటి సమాచారం అందిస్తున్నారు తదితర అంశాలపై అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి సమీక్షించారు. నాలుగు జిల్లాల్లో 22ఏ అంశంపై ప్రస్తుత పరిస్థితి, దరఖాస్తుల వివరాల గురించి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి వదిలేయకుండా దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత తహసీల్దార్, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్ తదితర అధికారులకు పంపించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు దాని పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కాల్ సెంటర్ నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్వీకరించిన అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుపై నిజానిజాలను నిర్ధారించి దరఖాస్తుదారు పేర్కొన్న సమస్య వాస్తవమా.. భూమి 22ఏ జాబితాలోకి ఎందుకు వచ్చింది.. దరఖాస్తుదారుడికి అర్హత ఉందా అనే అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. పరిశీలన అనంతరం స్పష్టమైన కారణాలతో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యను చెప్పిన తర్వాత పరిష్కారం కోసం మళ్లీమళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్ల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతోపాటు, గత రెండు మూడు రోజుల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఇకపై కొత్తగా వచ్చే దరఖాస్తులు పెండింగ్ పడకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. 22-ఎ సమస్య పరిష్కారాన్ని ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ‘రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన వ్యక్తి తన సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకంతో బయటకు వెళ్లాలి.. వచ్చిన దరఖాస్తును మరో కార్యాలయానికి పంపించి చేతులు దులుపుకోకండి.. చివరి వరకు పర్యవేక్షించండి.. మీ పనితీరుతో ప్రజల అభిమానాన్ని చూరగొనండి’ అని అధికారులకు సూచించారు.
రేపటినుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సమీక్షలు
క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ
ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయడం, భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపడమే లక్ష్యంగా రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల వారీగా సమీక్షలకు శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సమీక్షలు కేవలం అధికారిక సమావేశాలకే పరిమితంకాక క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను నిర్దేశించే విధంగా కొనసాగనున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల సమీక్షలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించడంతోపాటు, దూర ప్రాంత జిల్లాలకు మంత్రి స్వయంగా వెళ్లి అక్కడే సమీక్షలు నిర్వహించనున్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు సహా సంబంధిత శాఖల అధికారులందరూ ఈ సమీక్షల్లో పాల్గొంటారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కూడా సమీక్షల్లో భాగస్వాములను చేసి ప్రజల నుంచి వస్తున్న సమస్యలు, స్థానిక అవసరాలు, పరిష్కరించాల్సిన అంశాలను నేరుగా తెలుసుకునే విధంగా ఈ సమీక్షలను నిర్వహించనున్నారు.
హౌసింగ్ అమలుపైనా సమీక్ష
రెవెన్యూ అంశాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, హౌసింగ్ పథకాల అమలు, లబ్దిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణ పురోగతి, స్థలాల సమస్యలు తదితర అంశాలను కూడా జిల్లా సమీక్షల్లో మంత్రి పరిశీలించనున్నారు. జిల్లాల వారీగా చేపట్టనున్న సమీక్షల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షను జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్ష జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





