– రాష్ట్రంలో నడుస్తున్నది దోపిడీ పాలన
– బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ప్రజల ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ బ్రరోకర్‌లా వ్యవహరిస్తూ ప్రజల భూములను లూటీ చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఓ ప్రకటనలో ఆరోపించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లే 22-ఎ నిషేధిత జాబితాలోకి ఎక్కిందంటే ఇక రాష్ట్రంలో సామాన్యుడి ఆస్తికి ఏం భద్రత ఉంటుందని ప్రశ్నించారు. పరిస్థితి చేతులు దాటడంతోనే సీఎం స్పందించాల్సి వచ్చిందన్నారు. మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పారంటేనే ఘోరమైన స్కాం జరిగిందని ప్రభుత్వం స్వయంగా ఒప్పుకున్నట్లేనని, తప్పు చేయనప్పుడు క్షమాపణలు ఎందుకు చెబుతున్నారని నిలదీశారు. రాత్రికి రాత్రే ప్రైవేట్ భూములను 22-ఎలోకి మార్చడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేబినెట్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాహాటంగా ఒప్పుకుంటున్నారంటే కాంగ్రెస్ సర్కారు లోపల జరుగుతున్న స్కామ్‌ను వాళ్లే బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సామాన్యుడి ఆస్తులనే బంగాళాఖాతంలో ముంచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 22 లక్షల ఎకరాలు వివాదాల్లో ఉన్నాయని నాడు మొసలి కన్నీరు కార్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోనే ఏకంగా లక్షల ఎకరాల ప్రైవేటు భూములను 22-ఎ చిక్కుల్లోకి నెట్టారన్నారు. ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సి వస్తుందేమోనని హైకోర్టు సైతం మొట్టికాయలు వేసే దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందన్నారు. పైసాపైసా కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను కాంగ్రెస్ పెద్దల కన్ను పడితే చాలు వివాదాల్లోకి నెట్టి కబ్జా చేయడమే లక్ష్యంగా మారిందని, హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన స్థలం కనిపిస్తే చాలు.. రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి ఎక్కించి ఆ తర్వాత సెటిల్మెంట్లకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆ లిస్టు నుంచి పేరు తీయాలంటే 30% నుండి 40% కమీషన్లు లేదా వాటాలు డిమాండ్ చేస్తూ ప్రజలను, బిల్డర్లను బెదిరిస్తున్నారన్నారు. బడాబాబుల జోలికి వెళ్లకుండా చిన్న ఉద్యోగులు, పేదలు కొనుక్కున్న 60, 100 గజాల ప్లాట్లను 22-ఎలో పెట్టి వారి కడుపు కొడుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా అనుమతులు ఉండి, బ్యాంకులు రుణాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్ పూర్తయిన ఆస్తులను అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో ఎలా పెడతారని లక్ష్మణ్ ప్రశ్నించారు. జూలైలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం దారుణంగా పడిపోయినా సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదని, ప్రభుత్వ ఖజానా కంటే నేతల జేబులు నిండటమే వీరికి ముఖ్యమని వ్యాఖ్యానించారు. పెద్దల భూములను రాత్రికి రాత్రే 22-ఎ లిస్టు నుంచి తొలగిస్తూ సామాన్యుడిని నెలలతరబడి ఎందుకు తిప్పుకుంటున్నారని లక్ష్మణ్ నిలదీశారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా సామాన్యుల దరఖాస్తులు పరిష్కరించడానికి స్పష్టమైన కాలపరిమితితో కూడిన విధానాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదన్నారు. విలువైన ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ భూములకు సర్వే నంబర్లు మార్చి బై నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ అనుయాయులకు పంచుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక 22-ఎ జాబితా నుంచి ఎన్ని వేల ఎకరాలు తొలగించారు.. అందులో బడా కంపెనీలు, మంత్రుల బినామీలు ఎవరున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాం బయటపడగానే అంతా అధికారుల తప్పిదమేనని చేతులు దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. మంత్రుల ఆదేశాలు లేకుండానే అధికారులు ఇంత పెద్ద ఎత్తున చేస్తారా.. దొరికిపోగానే పదేళ్లుగా ఉన్న పాత అధికారుల కుట్ర అని చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ఆ అధికారులకు కీలక పోస్టింగులు ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ప్రజలు దరఖాస్తులు చేసుకోనవసరం లేదని మంత్రులు మీడియా ముందు చెబుతూ క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసి ఆగం చేస్తున్నారన్నారు. అపార్ట్మెంట్ ఫ్లాట్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చి విక్రయాలు జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం విదేశీ పర్యటన ముగిశాక కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామంటున్నారని, ప్రజల ఆస్తులను విముక్తం చేయడానికి కేబినెట్ దాకా ఆగాలా అని ప్రశ్నించారు. 22-ఎ పేరుతో జరిగిన వేల కోట్ల దందాపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. భూ కుట్రలను గ్రామాలు, పట్టణాల్లో ఎండగట్టి బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ప్రజా పోరాటాలు చేస్తుందని లక్ష్మణ్ హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


