రిజర్వాయర్లు అడుగంటాయ్.. రైతులను ఆదుకోండి

– ఎల్  నినో నేపథ్యంలో ముందస్తు చర్యలు అత్యవసరం
– సాగు, తాగునీటి ప్రణాళిక సిద్ధం చేయాలి
– కలెక్టర్, ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీకి హరీశ్ రావు లేఖ

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నిల్వ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు కోరారు. వచ్చే ఏడాది జూలై వరకు జిల్లాలో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నీటి కొర తను అధిగమించేందుకు ముందస్తు చర్యలు అత్యవసరమని పేర్కొంటూ కలెక్టర్ కు లేఖ‌ రాశారు. జిల్లా ఇరిగేషన్ అడ్వెజరీ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో హరీశ్రావు రాసిన లేఖలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు, రైతుల సాగు పరిస్థితి, తాగునీటి అవసరాలు, భూగర్భజలాల పరిస్థితి, రానున్న యాసంగి పంటకు నీటి లభ్యత తదితర అంశాలను ప్రస్తావించారు.

రిజర్వాయర్ల పరిస్థితి ఆందోళనకరం

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజ ర్వాయర్లను నిర్మించుకున్నామని హరీశ్ రావు తెలిపారు. సాధారణంగా ఏటా ఈ సమయానికి మిమ్మానేరు రిజర్వాయర్ నుంచి వీటికి నీటిని ఎత్తిపోసేవారని, ఈసారి ఇప్పటివరకు ఎత్తిపోతలు ప్రారంభించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లు ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయని, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కూడా అడుగంటిన పరిస్థితిలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లకు తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నింపాలని హరీశ్రావు కోరారు. రిజర్వా యర్ల నుంచి చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్లను నింపేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీనివల్ల భూగర్భజలాలు పెరిగి ప్రస్తుత వానాకాలం పంటలకు రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

65 శాతానికే వానాకాలం సాగు

ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా సుమారు 65 శాతం మంది రైతులే వానాకాలం పంటలు సాగు చేశారని హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు గట్టెక్కాలన్నా రిజర్వాయర్లను నింపడం అత్యవసరమని, రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. 2027 జూలై వరకు ఎల్సినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో అప్పటివరకు సాగు, తాగునీటికి కొరత రాకుండా ఇప్పటి నుంచే నీటి నిల్వలపై దృష్టి పెట్టాలని లని హరీశ్రావు సూచించారు.ప్రస్తుత అవసరాల కోసం నీటిని వినియోగించిన అనంతరం మళ్లీ ఎత్తిపోసుకునే అవకాశం ఉండేలా మిద్మానేరు రిజర్వాయర్లో జిల్లాకు సరిపడ నీటిని నిల్వ ఉంచాలని కోరారు. వచ్చే యాసంగి పంట కాలంలో అవసరమైనప్పుడు మిడ్మానేరు నుంచి నీటిని ఎత్తిపోసుకునేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని హరీశ్రావు కోరారు.

తాగునీటికి 6 నుంచి 7 టీఎంసీలు అవసరం

జిల్లాలో తాగునీటి అవసరాలకే సుమారు 6 నుంచి 7 టీఎంసీల నీరు అవసరమవుతుందని హరీశ్రావు తెలిపారు. వరి, పామాయిల్, ఇతర పంటలు సాగు చేసిన రైతులు నీటి ఎత్తిపోతల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రైతులు నీటిని ఎత్తిపోస్తారని ఆశగా ఎదు రుచూస్తున్న సమయంలో రిజర్వాయర్ల దుస్థితిని చూస్తే బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలోనే వడివడిగా నీటిని ఎత్తిపోసి ఉంటే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని హరీశ్రావు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లాలోని వాస్తవ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నీటిని జిల్లాకు అందుబాటులోకి తీసుకురావా లని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హరీశ్ రావు సూచించారు. వొచ్చే వేసవిని దృష్టిలో పె ట్టుకుని ఇప్పటి నుంచే రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయడమే తక్షణ ప్రాధాన్యతగా ఉండాలని హరీశ్రావు తన లేఖలో స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *