ఆటో కార్మికుల సంక్షేమానికి త్వరలో బోర్డు

– మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– ప్రజా భవన్‌లో ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులకు ఆత్మీయ విందు
– హాజరైన మంత్రులు పొన్నం, అడ్లూరి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : ఆటో కార్మికులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆటో డ్రైవర్లు, రవాణా రంగ కార్మికుల న్యాయమైన సమస్యలన్నింటినీ మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. శనివారం రాత్రి ప్రజాభవన్‌లో హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆత్మీయ విందు ఇచ్చారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆటో సంఘాల నాయకులతో భోజనం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో భట్టి మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యలను రవాణా శాఖ మంత్రి పొన్నం లోతుగా అధ్యయనం చేసి కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఆటో చార్జీల పెంపుపై డ్రైవర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించి కిలోమీటరుకు రూ.11గా ఉన్న చార్జీని రూ.14కు పెంచుతూ జీవో జారీ చేసిందన్నారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆటో చార్జీని కిలోమీటరుకు రూ.11గా నిర్ణయించిందని గుర్తు చేశారు. అనంతరం రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న పాలకులు ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోలేదని, వారు అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని విమర్శించారు.

సంక్షేమ బోర్డుపై కేబినెట్‌లో చర్చ

రవాణా రంగంలో దాదాపు 20 లక్షల కార్మిక కుటుంబాలు ఉన్నాయని, వారి సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చించామని చెప్పారు. చట్ట సభల్లో చర్చించి, అవసరమైన నిధులు కేటాయించే ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల ఇతర అంశాలపైనా కొంత సమయం తీసుకుని న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.కేవలం జీవోలు జారీ చేసి ప్రచారం చేసుకోవడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. ప్రజాభవన్‌కు ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులను ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడమే ఈ సమావేశం ఉద్దేశమన్నారు. ప్రభుత్వం తమది, ప్రజలదే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని సూచించారు.

డీజిల్ ఆటోలకు బదులు బ్యాటరీ ఆటోలు

నగరం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. నగరంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. డీజిల్ ఆటోలను బ్యాటరీ ఆటోలుగా మార్చేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ కింద రూ.200 కోట్లను కేటాయించామని తెలిపారు. ఒక్కో ఆటోకు ప్రభుత్వం తరఫున రూ.1.50 లక్షల సబ్సిడీ అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో సోలార్, బ్యాటరీ, సీఎన్‌జీ ఆటోలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్న రవాణా శాఖ మంత్రి పొన్నంను భట్టి అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *