కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

– ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు అందించాలి
– సంగారెడ్డి జిల్లా సదస్సులో డిమాండ్
– సెప్టెంబర్ లోపు గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాలి
– రాష్ట్రస్థాయి ‘కౌలు రైతుల గర్జన’కు సిద్ధం : సాధన కమిటీ 

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : వ్య‌వ‌సాయంలో కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం తక్షణమే గుర్తింపు కార్డులు మంజూరు చేసి ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు అందించాలని తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్ చేసింది. సంగారెడ్డిలోని టిపిటిఎఫ్ భవన్లో సాధన కమిటీ ప్రతినిధి రాగులపల్లి లక్ష్మి అధ్యక్షతన జిల్లా కౌలు రైతుల సమావేశం మంగళవారం జరిగింది. హత్నూర, మొగడంపల్లి, జహీరాబాద్, జరాసంఘం, న్యాలకల్, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాల కౌలు రైతులు వచ్చి తమ కష్టాలను వివరించారు. కౌలు రైతులకు గుర్తింపు సాధించుకునేందుకు పోరాటం చేయడానికి సిద్ధమని, హైదరాబాద్ స్థాయిలో కౌలు రైతుల గర్జనలో పెద్ద ఎత్తున పాల్గొంటామని ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులు తాము కౌలు వ్యవసాయంలో ప్రభుత్వ మద్దతు లేక, బ్యాంకు లోన్లు లేక అప్పుల ఊబిలో కూరుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కలుగుతుందని, ఆత్మహత్యలు జరగకుండా కౌలు రైతులను ప్రభుత్వం అన్ని పథకాలు అందించాలని కోరారు. సాధన కమిటీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో 36 శాతం పైగా ఉన్న కౌలు రైతులు పంటల ఉత్పతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు కానీ రైతులకు అందే సౌకర్యాలు కౌలు రైతులకు అందడం
లేదన్నరు. ప్రభుత్వం నుండి గుర్తింపు లేకపోవడం వలన సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, పంట నష్టపరిహారం, రైతు బీమా ఆఖరికి తమ పంటను ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్ముకునే అవకాశం కూడా కౌలు రైతులకు లభించట్లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్షం వల్లనే కౌలు రైతుల ఆత్మ హత్యలు పరంపరా కొనసాగుతున్నాయి. అందుకనే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ అనేక ప్రజా సంఘాలు, ప్రముఖులతో ఏర్పడి ఈ విషయంలో విస్తృత ప్రచారం చేసి ప్రభుత్వంపై వత్తిడి తెస్తుదని తెలిపారు. ఇటీవల కౌలు రైతుల పరిస్థితి పై సాధన కమిటీ రాష్ట్ర వ్యాప్త సర్వే నిర్వహించింది. 22 జిల్లాలు, 47 మండలాలు, 58 గ్రామాలలో 1816 మంది కౌలు రైతులను ప్రత్యక్షంగా కలిసి చేసిన ఈ సర్వేలో వెల్లడి అయిన ముఖ్యాంశాలను కొండల్ రెడ్డి వివరించారు. కౌలు రైతుల సర్వే నివేదిక తయారు చేసి ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సదస్సులు నిర్వహించి రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజా సంఘాలు, వ్యవసాయ అనుబంధ రంగాల వారికి సమర్పించారు.

అదనపు కలెక్టర్ హామీ

సమావేశం తర్వాత కౌలు రైతులు, సాధన కమిటీ నాయకులు అదనపు కలెక్టర్ సంగీతని కలిసి కౌలు రైతుల సమస్యల గురించి వినతి పత్రం సమ ర్పించారు. ఇటీవల సాధన కమిటీ చేసిన కౌలు రైతుల సర్వే రిపోర్ట్ ను స్వీకరించిన అదనపు కలెక్టర్ కౌలు రైతులు తీవ్ర సమస్యలలో ఉన్నారని అంగీకరించి వారి గుర్తింపుకి తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి కౌలు రైతుల గుర్తింపు అవసరాన్ని వివారిస్తామని హామీ ఇచ్చారు.

డిమాండ్లు ఇవీ..

2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ అధీకృత సాగుదా రుల చట్టం ప్రకారం కౌలు సాగుదారులకు ప్రతి సంవత్సరం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గుర్తింపు పొందిన కౌలు సాగుదారులకు అందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని కౌలు రైతులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ నెల లోపు కౌలు రైతుల గుర్తింపు మొదలు పెట్టాలని, అప్పుడే ఈ సీజన్లో పంట అమ్ముకోవడానికి వీలు అవుతుందని అన్నారు. తమకు గతంలో అందిన కార్డుల వలన పంట రుణాలు, ప్రభుత్వ పథకాలు లభిం చాయని కౌలు రైతులు తెలిపారు. ప్రతి పథకానికి ఫోన్ యాప్ లలో భూ యజమానికి ఓటీపీ పంపే వ్యవస్థ వలన కౌలు రైతులకి చాలా ఇబ్బంది కలుగుతున్నదని, సీజన్ మొదట్లోనే కౌలు రైతులకు గుర్తింపు ఇచ్చి అన్ని పథకాలలోనూ లబ్ది కలిగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి సాధన కమిటీ తరపున రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు బి.కొండల్ రెడ్డి, కన్నెగంటి రవి, విస్సా కిరణ్ కుమార్, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు పి.శంకర్ పాల్గొన్నారు. టిపిజెఎసి జిల్లా కన్వీనర్ వై. అశోక్ కుమార్, రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు రంగా గౌడ్, మంజీర రైతు సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ పాల్గొని కౌలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. సంగారెడ్డి సాధన కమిటీ తరపున ఆర్. లక్ష్మి తో బాటు బి. చుక్కమ్మ, ఎం. విక్రమ్, మానస పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *