రాజకీయ ఆయుధంగా కరువు

– కృష్ణా, గోదావరి జలాల మళ్లింపుపై బీఆర్‌ఎస్ అసత్య ప్రచారం
– కాంగ్రెస్ హయాంలో పెరిగిన నీటి వాడకం, సాగు విస్తీర్ణం, వరి ఉత్పత్తి
– జనవరి 31లోగా 10 వేల ఎకరాలకు కృష్ణా జలాలు
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్/పాలకవీడు, ప్రజాతంత్ర, నవంబరు 11 : బీఆర్‌ఎస్ నేతలు కరువును రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి తలెత్తే ముప్పు ఉన్న వేళ రైతులకు అండగా నిలవాల్సిన ప్రధాన ప్రతిపక్షం వారి కష్టాల నుంచి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో బుధవారం పర్యటించిన మంత్రి కోదాడ నియోజకవర్గం పరిధిలోని రెడ్లకుంట తదితర పలు ఎత్తిపోతల పథకాల పనులతోపాటు యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణాన్ని పరిశీలించారు. 2023 డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కృష్ణా, గోదావరి జలాలను బీఆరఎస్ హయాం కంటే రాష్ట్రం ఎక్కువగా వినియోగించుకుందని, సాగు విస్తీర్ణం, వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ పెరిగాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని మళ్లిస్తున్నారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఉత్తమ్ స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి రంగంలో పేరుకుపోయిన సమస్యలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. తాము బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ధాన్యం కొనుగోళ్ల ద్వారా రైతులకు సుమారు రూ.90 వేల కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. సన్న రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రవేశపెట్టామని చెప్పారు.

జనవరి 31లోగా 10 వేల ఎకరాలకు కృష్ణా జలాలు

పులిచింతల జలాశయం తీర గ్రామాల రైతులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకాన్ని జనవరి నెలాఖరులోగా ప్రారంభిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. సవరించిన ఆయకట్టు పరిధిలోని 10 వేల ఎకరాలకూ 2027 జనవరి 31 నాటికి కృష్ణా జలాలు అందించాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ‘ఈ పనులను పలుమార్లు పరిశీలించా.. ప్రతిసారీ గడువు మారుతోంది.. ఇకపై అలా జరగొద్దు.. జనవరి ఆఖరులోగా మొత్తం పది వేల ఎకరాలకూ నీరు చేరాలి’ అని తేల్చిచెప్పారు. గడువు తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళ్లెదుటే నది ప్రవహిస్తున్నా దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోని వేలాది రైతు కుటుంబాలకు ఈ పథకంతో ఊరట లభిస్తుందని, ఏటా రెండు పంటలు పండించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ పథకంతో జాన్‌పహాడ్, పాలకవీడు, కోమటికుంట, ఓతులపాలెం, ఎల్లాపురం, సజాపురం, హనుమాయగూడెం, నాగిరెడ్డిగూడెం, గుడుగుంట్లపాలెం, గుండ్లపహాడ్, చెరువుతండా, అలింగాపురం, గుండెబోయినగూడెం, రాఘవాపురం, మిగడంపాడు తండా గ్రామాలకు ప్రయోజనం చేకూరనుందన్నారు. పంపులు, మోటార్లు ఇప్పటికే పనుల ప్రదేశానికి చేరాయని, పంప్‌హౌస్ పనులు తుది దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. డిసెంబరు నెలాఖరులోగా పంప్‌హౌస్, జనవరి నెలాఖరులోగా విద్యుత్ ఉపకేంద్రం పనులు పూర్తి చేసి నిర్ణీత గడువులో పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. కల్మల తండా వైపు నీరు అందించేందుకు బుడ్డారపాలెం వద్ద కిలోమీటరు మేర కాలువ అనుసంధాన పనులు పూర్తి చేయాలన్నారు. జాన్‌పహాడ్, మునిమోపుల, తుమ్మల సహా ఆరు చెరువులను ఈ పథకం ద్వారా నింపనున్నట్లు వివరించారు. జాన్‌పహాడ్ తన ప్రాధాన్య పథకాల్లో ఒకటని ఉత్తమ్ చెప్పారు. కృష్ణా నదికి చేరువలో ఉన్నా ఇన్నాళ్లూ సాగునీరు అందని భూములకు నీటిని ఎత్తిపోయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. ముక్తేశ్వరం సహా స్థానిక ఎత్తిపోతల పథకాలు రైతు కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురాగలవన్నారు.

యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయండి

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే యాసంగిలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశముందని ఉత్తమ్ తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, సాగునీటిని పొదుపుగా వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అందుబాటులో ఉన్న జలాలను సమర్థంగా వినియోగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నారు. ఆహార కొరత తలెత్తకుండా ప్రజాపంపిణీకి అవసరమైన సన్న బియ్యం సహా తగిన ఆహార ధాన్యాల నిల్వలను సిద్ధం చేసినట్లు తెలిపారు.

చిలుకూరు మండలంలో వైఐఐఆర్‌ఎస్ నిర్మాణం పరిశీలన

కోదాడ నియోజకవర్గం చిలుకూరులో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా పాఠశాలలో 2027-28 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా భవన నిర్మాణం పూర్తి చేసి తరగతులకు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పురోగతిని ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో మాట్లాడారు. కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *