– 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్‌బీఐ
– ఆగస్టులో ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరిక
– ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో నిర్ణయం
– ‘జంబో హైక’ వైపు మొగ్గు చూపవచ్చు
– ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి
– ఒకేసారి కఠిన చర్యలు తీసుకోవడం తప్పదు
– ఎస్‌బీఐ అడ్వైజర్ డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్
న్యూదిల్లీ, అక్టోబర్ 7: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు సవాళ్లుగా మారుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటుతోపాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 5.25 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు 5.75 శాతానికి చేరాయి.ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉందని మల్హోత్రా తెలిపారు. దీంతో పలు ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. భారత్‌లోనూ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆగస్టులో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. జూలైలో ఇది 4.45 శాతంగా ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. అంతర్జాతీయంగా బాండ్ ఈల్డస్ పెరగడం, క్రూడ్ ధరలు ఎగబాకడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడంతో రెపో రేటును యథాతథంగా ఉంచే అవకాశం తగ్గిందని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఫిబ్రవరి 2023 తర్వాత తొలిసారి రెపో రేటు పెరగొచ్చని నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ద్రవ్యోల్బణం దాదాపు 5 శాతానికి చేరుతున్న నేపథ్యంలో రానున్న సమావేశాల్లోనూ కఠిన నిర్ణయాలు ఉండొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, మార్కెట్లలో మారుతున్న రిస్క్‌ల నేపథ్యంలో ముందస్తు చర్య తీసుకోవడం మంచిదని ఎస్‌బీఐ రీసెర్చ్ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎల్‌నినో ప్రభావం, అక్టోబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కూడా రబీ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు డిసెంబర్ ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) పెంచే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అనిశ్చితంగా ఉన్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ‘జంబో హైక’ వైపు మొగ్గు చూపవచ్చని బుధవారం విడుదల చేసిన ఈ నివేదిక పేర్కొంది. వడ్డీ రేట్లను విడతలవారీగా స్వల్పంగా పెంచడం కంటే ఒకేసారి కఠిన చర్యలు తీసుకోవడమే సమంజసమని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ అభిప్రాయపడ్డారు. డిసెంబర్ నాటికి రెపో రేటును 6 శాతానికి చేర్చడమే సరైన మార్గమని స్పష్టం చేశారు. ఇటీవలి ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చిన సంగతి విదితమే. ఆర్‌బీఐ తన వైఖరిని మార్చుకుందని ఎస్‌బీఐ రీసెర్చ్ విశ్లేషించింది. గతంలో పరిస్థితులను కేవలం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్న ఆర్‌బీఐ అక్టోబర్ పాలసీలో మాత్రం ద్రవ్యోల్బణం కట్టడిపై తన కఠిన వైఖరిని స్పష్టంగా ప్రదర్శించిందని తెలిపింది. వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలను కూడా ఆర్‌బీఐ సవరించింది. 2027 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 7.1 శాతానికి, సీపీఐ ద్రవ్యోల్బణం అంచనాను 5.20 శాతానికి పెంచింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.5 శాతానికి చేరవచ్చని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. చారిత్రక పరిణామాలను పరిశీలిస్తే ద్రవ్యోల్బణం తీవ్రతకు అనుగుణంగానే ఆర్‌బీఐ రెపో రేటు పెంపు ఉంటుందని నివేదిక గుర్తు చేసింది. ప్రస్తుత అంచనాల ప్రకారం, 2026 నవంబర్ నాటికి ద్రవ్యోల్బణం 6.8 శాతానికి చేరితే, రెపో రేటును 6 శాతం వరకు పెంచే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





