– కిషన్ రెడ్డిని కోరిన మంత్రి పొన్నం
– లోక్‌సభలో మాట్లాడిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోలేం
– పొన్నం లేఖపై డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలో మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం సరికాదన్నారు. తేజస్వీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు లోక్‌సభ స్పీకర్‌ను ఒప్పించాలని కోరారు. ఎంపీ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ శివధర్ రెడ్డికి మంత్రి లేఖ రాశారు. ఈ లేఖపై డీజీపీ స్పందిస్తూ చట్టసభల్లో మాట్లాడిన అంశాలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వి మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు.
పార్లమెంటు ముందు కాంగ్రెస్ ఎంపీల నిరసన
న్యూదిల్లీ, ఏప్రిల్ 17: పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఏర్పాటును భారత్ – పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దని ప్లకార్డులు ప్రదర్శిస్తూ బైఠాయించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఎంపీలు నినాదాలు చేశారు. ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, వేం నరేందర రెడ్డి, కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.
సూర్య మాటల్లో తప్పేముంది : మంత్రి బండి ఆగ్రహం
న్యూదిల్లీ, ఏప్రిల్ 17: తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాటలను కాంగ్రెస్ నేతలు ఎందుకు తప్పుబడుతున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట విభజన సమయంలో కాంగ్రెస్ తప్పిదాలతో పలువురు యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని తేజస్వి సూర్య చెప్పారన్నారు. 2009లో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు సహకరించి మళ్లీ వెన్నక్కి తగ్గిందని, దీని గురించే తేజస్వి మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి గతంలో సోనియాగాంధీని బలిదేవత అన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు. అలాంటి రేవంత్ కేబినెట్‌లో ఉన్న పొన్నం తదితరులు గతాన్ని మరిచి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్‌లో రణభేరి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని వెళ్లారని బండి తెలిపారు. 1400 మంది బలిదానాలకు కారణమైన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. ఒక్క ఓటు, రెండు రాష్ట్రాలు అనే నినాదానికి కట్టుబడి రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ కావాలని అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీఆరఎస్ అవినీతి గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




తెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు తగవు