సుబేదారి, ప్రజాతంత్ర అక్టోబర్, 30 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నేరరహిత వరంగల్‌ నిర్మాణం, డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపనే తమ ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ఆటోనగర్, కరీమాబాద్, కాశిబుగ్గ, శంభునిపేట, శివనగర్, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, పాత నేరస్థులు, మాదకద్రవ్యాల కేసులతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సమాజ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా, విక్రయాలు, అక్రమ రవాణాకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారిని కేవలం నేరస్థులుగా చూడకుండా అవసరమైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించి తిరిగి సాధారణ జీవనంలోకి తీసుకువచ్చేందుకు కూడా పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. ఈ తనిఖీల్లో రౌడీషీటర్లు, పాత నేరస్థులు, డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్నవారు, ఇతర అనుమానితులు కలిపి మొత్తం 107 మందిని అదుపులోకి తీసుకొని మాదకద్రవ్యాల వినియోగ పరీక్షలు నిర్వహించగా, వారిలో 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. వీరిపై చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 17 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, మూడు ఎలక్ట్రిక్ మోటార్ పంపులను నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో పిటా (PITA) చట్టం కింద ఒక కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం సేకరించారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని వివరిస్తూ, ప్రతి కాలనీలో ప్రజల భాగస్వామ్యంతో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసులకు ప్రజలు సహకరిస్తే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇకపై కూడా ఇదే తరహా ఆకస్మిక తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు, అక్రమ రవాణా లేదా ఇతర నేరాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే డయల్ 100 / 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, వరంగల్ ఇన్‌చార్జి ఏసీపీ నరసింహారావు, మట్టేవాడ, ఇంతేజార్‌గంజ్, మిల్స్ కాలనీ, మడికొండ, ఐటీ కోర్ పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు