అంగన్‌వాడీల్లో మౌలిక వసతులకు పెద్దపీట

– జాప్యం లేకుండా పాలు, బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాలి
– అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : రాష్ట్రంలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో వంద శాతం టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు అందుబాటులోకి వాలని అధికారులను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గత ఏడాది కాలంలోనే అదనంగా 5,938 కేంద్రాలకు టాయిలెట్, 3,815 కేంద్రాలకు తాగునీటి, 14,271 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించినందుకు అధికారులు, సిబ్బందిని అభినందించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. మిగిలిపోయిన మౌలిక వసతుల పనులను ఏమాత్రం జాప్యం చేయకుండా పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ వంటి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సంబంధిత ఏఈలు, డీఈలతో సమన్వయం చేసుకుని పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఏ కేంద్రంలో ఏ పని పూర్తయింది, ఇంకా ఎంత పని మిగిలి ఉందన్న వివరాలతో నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. చిన్నారులకు అందుతున్న పోషకాహారం, వారి ఎదుగుదలపై శాంపిల్ సర్వే నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. సర్వే ఫలితాల ఆధారంగా పోషకాహార కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. చిన్నారులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్ అందించే కార్యక్రమాలను అన్ని జిల్లాల్లో వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు జిల్లాలవారీగా టీచర్లు, ఆయాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించి క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, సేవల మెరుగుదలకు సంబంధించిన సూచనలు స్వీకరించి వాటి ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 16 జిల్లాల్లో నియామకాలకు నోటిఫికేషన్లు జారీ అయినట్లు అధికారులు వివరించగా మిగిలిన జిల్లాల్లో ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ టీచర్లకు డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిప్లొమా సర్టిఫికెట్లు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కేంద్రాలు పిల్లల అభ్యాసం, ఆటపాటలు, ఆరోగ్యం, పోషణకు అనువైన వాతావరణంగా మారాలని చెప్పారు. వర్షాల కారణంగా ఎక్కడైనా కేంద్రాన్ని మార్చాల్సి వస్తే చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ఇప్పటికే 54 తల్లి ఒడి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించగా అన్ని జిల్లాలు, ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో అడాప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17 అడాప్షన్ సెంటర్లు ఉన్నట్లు అధికారులు వివరించారు. పిల్లల సంరక్షణ, దత్తత ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగేలా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లాలని ఆదేశించారు.

నిధులను పూర్తిగా వినియోగించాలి

కేంద్రం నుంచి వచ్చే నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి రూపాయి సమర్థవంతంగా వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ఇద్దరుముగ్గురు అధికారులను నియమించి సమన్వయ వ్యవస్థను మరింత ప్రభావవంతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారుల మధ్య సమన్వయం కోసం కూడా ప్రత్యేక బాధ్యతలు అప్పగించి, రోజువారీ, వారపు నివేదికలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారులు హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలను ఎన్ని సందర్శించారు, అక్కడ గుర్తించిన సమస్యలు ఏమిటి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఏమిటన్న వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. శాఖ కార్యదర్శి శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *