ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టాం

– కాలుష్య రహితంగా కూకట్‌పల్లి
– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్      

కూకట్‌పల్లి, ప్రజాతంత్ర, మే 27 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించగా వాటిని ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 545 ఈవీ బస్సులు నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 2,200 ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. నగరంలో కొత్త కాలనీలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను కూడా అదేస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు కొత్త బస్సుల కొనుగోలు ద్వారా మహిళలను యజమానులుగా నిలబెట్టామని మంత్రి ప్రభాకర్  అన్నారు. ప్రజా రవాణాలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కూకట్‌పల్లి డిపో విస్తరణలో భాగంగా ఐదు ఎకరాల స్థలంలో కొత్త డిపో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కూకట్‌పల్లి ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా మార్చడంలో ఈవీ బస్సులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేయాలన్నారు. త్వరలోనే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *