– వానాకాలం-2026 పుస్తకం ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ రూపొందించిన ‘తెలంగాణ వ్యవసాయ అత్యవసర, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ‘వానాకాలం-2026’ పుస్తకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల ప్రణాళిక రూపొందించుకోవడానికి, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడానికి, పంటల సంరక్షణ చర్యలను చేపట్టడానికి ఈ పుస్తకం సమగ్ర మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. శాస్త్రీయ సమాచారం, వాతావరణ అంచనాలు, జిల్లా వారీ కార్యాచరణ ప్రణాళికలు, పంటల నిర్వహణ సూచనలను సమన్వయం చేస్తూ రూపొందించిన ఈ పుస్తకం రైతులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భారత వాతావరణ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి-సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ, భారత చిరు ధాన్యాల పరిశోధన సంస్థ , భారత నూనె గింజల పరిశోధన సంస్థ, నీటిపారుదల, విద్యుత్, భూగర్భ జల శాఖల సాంకేతిక సహకారంతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత విశ్లేషణ, వాతావరణ అంచనాలు, భూగర్భ జలాల పరిస్థితి, జలాశయాల నీటి లభ్యత, జిల్లావారీ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు, పంటల నిర్వహణ పద్ధతులు, తేమ సంరక్షణ చర్యలు, విత్తనాల లభ్యత, రైతులకు అందించాల్సిన అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలను సమగ్రంగా పొందుపరిచారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి, , ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ బాషా, సహకార శాఖ ప్రత్యేక సంచాలకుడు రాహుల్ రాజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, భారత వాతావరణ శాఖ, ఐసీఏఆర్-క్రెడా, ఐసీఆరఐశాట్, భారత చిరు ధాన్యాల పరిశోధన సంస్థ, భారత నూనె గింజల పరిశోధన సంస్థ, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, నీటిపారుదల, విద్యుత్, భూగర్భ జల శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





