యూకేకు ఎగుమతులు పెంచుతాం

– పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : భారత్- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) వల్ల తెలంగాణ గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం వల్ల దేశం నుంచి ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై యÖకే సుంకాలను తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యూకే డిప్యూటి ట్రేడ్ కమిషనర్(దక్షిణాసియా) చంద్రు కె అయర్ ఆధ్వర్యంలో సచివాలయంలో గురువారం తనను కలిసిన ప్రతినిధి బృందంతో శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య రూ.32.56 లక్షల కోట్ల (25 బిలియన్ పౌండ్స్) వాణిజ్యానికి అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వస్తూత్పత్తి, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటి, సెమికండక్టర్స్, చిప్‌ల డిజైన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలను వృద్ధి చేశామని, యూకే పారిశ్రామికవేత్తలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రం నుంచి యÖకేకు ప్రస్తుతం రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయని, కొత్త ఒప్పందం వల్ల ఎగుమతులను భారీగా పెంచుకునే అవకాశం ఏర్పడిందని వివరించారు. విమానయాన రంగానికి అవసరమైన ప్రిసిషన్ విడిభాగాల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఏవియేషన్ సంస్థలు ఎయిర్ బస్, బోయింగ్, రోల్స్ రాయిస్, విమాన ఇంజన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీస్, డసో ఏవియేషన్ ఉత్పత్తి చేసే రఫేల్ విమానాల విడిభాగాల తయారీ, ఓవర్ హాలింగ్ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్, సఫ్రాన్ ఏవియేషన్ సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఫార్చ్యూన్ 500 కంపెనీలు సహా పలు ప్రఖ్యాత సంస్థలు 350 జీసీసీలను ఏర్పాటు చేశాయని చెప్పారు. యూకే నుంచి భారత్ పర్యటించే మేయర్ల బృందాన్ని హైదరాబాద్‌ను కూడా సందర్శించేలా చూడాలని చంద్రు కె అయర్‌ను మంత్రి కోరారు. అధికారులతో కలిసి యుకెను సందర్శించి అక్కడ పారిశ్రామిక, వాణిజ్య ఎకోసిస్టంను పరిశీలించాలని చంద్రు అయర్ శ్రీధర్‌బాబును ఆహ్వానించారు. యుకె ప్రతినిధి బృందంలో సిద్దార్థ్ విశ్వనాథన్, నళిని రఘురామన్, ప్రవీణ్ పద్మనాభన్, పరిశ్రమల శాఖ స్సెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *