– దీంతో దక్షిణ ఆందోళనలకు ముగింపు పలకొచ్చు
– బీజేపీ జాతీయ మండలి సభ్యుడు శశిధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : జనాభా నియంత్రణ కార్యక్రమం 1976లో ఉత్తరాన అంతగా విజయవంతం కాకపోవడంతో అక్కడ జనాభా పెరుగుదల వల్ల అసమతుల్యత కారణంగా తమ లోక్‌సభ సీట్లను కోల్పోతామనే భయాన్ని దక్షిణ రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయని బీజేపీ జాతీయ మండలి సభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లను కేటాయించడానికి 1971 నాటి జనాభాను ప్రాతిపదికగా నిర్ణయించిందన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల వరకు 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్యను మార్చకుండా రాష్ట్రాల్లోని ప్రాదేశిక నియోజకవర్గాలను పునర్‌వ్యవస్థీకరించడానికి 84వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చిందని చెప్పారు.. గత ఏడాది మార్చి 6న చెన్నైలో ఒక అఖిలపక్ష సమావేశానికి స్టాలిన్ నాయకత్వం వహించి రాబోయే ముప్పయ్యేళ్లపాటు అంటే 2055 వరకు లోక్‌సభ సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ప్రకారమే కొనసాగుతుందని పార్లమెంటులో హామీ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారని గుర్తు చేశారు. తద్వారా 1999లో తన దివంగత తండ్రి చేసిన డిమాండ్‌ను మరో 20 ఏళ్లపాటు పొడిగించారన్నారు. 2011 ప్రాతిపదికన రాష్ట్రానికి లోక్‌సభ సీట్లను కేటాయిస్తే ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని, దాని ఆధారంగా ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య చీలిక ఏర్పడుతుందని తాను 2019లో ఆందోళన వ్యక్తం చేశానని శశిధర్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న 129 సీట్లలో దక్షిణాది కనీసం 33 సీట్లను కోల్పోతుందని చెప్పానన్నారు. తత్ఫలితంగా హిందీ బెల్ట్‌లో 29 సీట్లు పెరుగుతాయని, సీట్లు కోల్పోతామనే దక్షిణాది రాష్ట్రాల భయంపై దృష్టి పెట్టాలని అప్పుడు బీజేపీ నాయకత్వాన్ని కోరానని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు మొదలైన జనాభా లెక్కల ఆధారంగా కేటాయించడం వల్ల దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుందని, ఇప్పుడున్న 129 సీట్లలో 40పైగా కోల్పోతారని చెప్పానన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రతిపాదన 1971 ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల పంపిణీని మార్చడం కాక మహిళా రిజర్వేషన్‌ను పరిగణనలోకి తీసుకుని అన్ని రాష్ట్రాలకు 50% సీట్లను అదనంగా పెంచాలన్నారు. 1971 ప్రాతిపదికలో మార్పు లేదని, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల, ముఖ్యంగా గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఈ రిజర్వేషన్ అనేక దశాబ్దాలుగా అంతుచిక్కకుండా ఉందని తెలిపారు. చివరకు 2023లో కొత్త భవనంలో జరిగిన పార్లమెంట్ చరిత్రాత్మక తొలి సమావేశంలో ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వంతో ఇది వాస్తవరూపం దాల్చిందన్నారు. తమిళనాడు, తెలంగాణ, అన్ని దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభలో శాతాల ఆధారంగా యథాతథ ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తాయని, ఇది వివాదాన్ని నివృత్తి చేస్తుందని తెలిపారు. . నియోజకవర్గాల పునర్విభజన బీజేపీ ఆధిపత్యం ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడానికి, వారి ప్రాబల్యం పెంచడానికని అనడం సరికాదని హితవు పలికారు. దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఇది కుట్ర అనడం, దీనిని రాజకీయ ప్రేరేపిత చర్యగా ముద్రవేసి బీజేపీని నిందించడం తగదన్నారు. ఒక దక్షిణాది భారతీయుడిగా లోక్‌సభ సీట్ల కేటాయింపు సంఖ్యను యథాతథంగా ఉంచి, మహిళలకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న 33% రిజర్వేషన్‌ను కల్పించడానికి అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లను మాత్రమే అదనంగా చేర్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను దక్షణాది ప్రజలు స్వాగతించాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శించిన రాజనీతిజ్ఞతకు, పరిణతికి అందరూ ధన్యవాదాలు తెలపాలన్నారు.
——————————————————————————————————————————————————————తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




తెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు తగవు