– ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు గాంధీజీ మాట మార్గదర్శకం
– మహిళా బిల్లుపై మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: లక్ష్యం మాత్రమే కాదు.. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాలు కూడా మంచివే కావాలి అని మహాత్మా గాంధీజీ చెప్పిన ఆలోచన ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మార్గదర్శకం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివ ద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల అంశంపై లోక్‌సభలో శుక్రవారం జరిగిన పరిణామాలు బీజేపీ కపట నీతిని బహిర్గతం చేశాయని విమర్శించారు. మహిళల సాధికారతపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే సింపుల్ మెజారిటీతోనే రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కావాలని డీ లిమిటేషన్ అంశాన్ని జోడించి బిల్లును సంక్లిష్టం చేశారని మండిపడ్డారు. ఇది మహిళల హక్కులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కాదని, రాజకీయ లాభాల కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని స్పష్టమవుతోందన్నారు. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల దృష్టి కోణంతోనే ఈ బిల్లును ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం మీలో కనిపిస్తోందని బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ భావజాలమే మహిళా వ్యతిరేకమైనదని, లోక్‌సభ సాక్షిగా బీజేపీకి మహిళా రిజర్వేషన్లపై నిజమైన నిబద్ధత లేదనే విషయం నిరూపితమైందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, మహిళల హక్కులకు మద్దతుగా నిలిచిన విజయమన్నారు. దేశానికి మహిళా ప్రధానిని, మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, విద్య, ఉపాధి అవకాశాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. మహిళల సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కాంగ్రెస్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. మహిళా రిజర్వేషన్లను ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




తెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు తగవు