‘డిస్మిస్డ్‌’ కేసుల పునఃపరిశీలనకు దరఖాస్తుల ఆహ్వానం

– సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : సింగరేణి సంస్థలో 2023 నుంచి 2025 మధ్య కాలంలో విధులకు గైర్హాజరు కారణంగా తొలగింపునకు గురైన ఉద్యోగుల కేసులను పునఃపరిశీలించాలని యాజమాన్యం నిర్ణయించింది. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకునేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 1.1.2023 నుంచి 31.12.2025 మధ్య కాలంలో గైర్హాజరు కారణంగా తొలగింపునకు గురైన వారు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. 1.4.2026 నాటికి 46 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలని పేర్కొంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా డిస్మిస్డ్ ఉద్యోగులకు తిరిగి ఉద్యోగావకాశం కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరిన నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలించాలని ఆయన యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2023 నుంచి 2025 మధ్య కాలంలో గైర్హాజరు కారణంగా డిస్మిస్ అయిన ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది.

ఇవీ అర్హతలు

తొలగింపునకు గురైన కాలానికి ముందున్న గత ఐదు క్యాలెండర్ సంవత్సరాలలో ఏదైనా రెండు సంవత్సరాలలో కనీసం వంద మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. జనరల్ అసిస్టెంట్ ట్రైనీ (యూజీ),  కేటగిరీ-1 పోస్టులో పునర్నియామకం కోసం వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి. అర్హత కలిగి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే డిస్మిస్డ్ ఉద్యోగులు తగిన ప్రొఫార్మాలో దరఖాస్తును పూర్తి చేసి తాము చివరగా పనిచేసిన గని/డిపార్ట్‌మెంట్ అధిపతికి సమర్పించాలి. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఈనెల 14గా సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఏరియా జనరల్ మేనేజర్లు అర్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యల నిమిత్తం నిర్ణీత తేదీలోగా సంబంధిత అధికారులకు పంపాలని సూచించింది. పూర్తి వివరాల కోసం సంబంధిత గనులు లేదా శాఖల అధికారులను సంప్రదించాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *