డబ్బులు దండుకోవడానికే నిషేధిత జాబితా

~ ప్రజల్లో గందరగోళం రేపిన 22-ఎ జాబితా
~ సీలింగ్ చట్టం ఎత్తేశాక మళ్లీ ఎందుకొచ్చింది
~ సీఎం రేవంత్ ఇల్లు జాబితాలో వచ్చాకనే చురుకు
~ పాలనపై పట్టు లేదనడానికి ఇదే పెద్ద నిదర్శనం
~ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం

హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 17: రాష్ట్రంలో 22ఎ సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను తీవ్ర గందరగోళానికి, అయోమయానికి గురిచేస్తోందని.. బిఆర్ ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఎవరి భూమి 22ఎలో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నా రని తెలిపారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1999లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారు. మన రాష్ట్రంలో 2008లోనే పూర్తిగా ఎత్తేశారు. కానీ ఆనాడు సీలింగ్ పరిధి నుంచి బయటపడి క్లియర్ అయిన భూములను కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చి సీలింగ్ యాక్ట్ కింద 22ఎలో పెట్టడం ఏ రకమైన న్యాయం.. ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన, పాలనపై పట్టు లేదనడానికి ఇదే నిదర్శనమని ఆయ‌న‌ అన్నారు. ఏకంగా ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రభుత్వ భూములను కూడా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి ప్రొహిబిషన్ లిస్ట్ లో చేర్చారు. శ్రీనగర్ కాలనీ సర్వే నంబర్ 8, 9లలో గత 20 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ప్రశాంతంగా నివసిస్తున్న ప్రజల ప్రాపర్టీలను కూడా ఇప్పుడు 22ఎలో పెట్టడం దుర్మార్గం. 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న అపార్ట్మెంట్ ప్లాట్లను కూడా  నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఇప్పుడు ఎక్కడికి పోవాలని హరీష్ రావు ప్రశ్నించారు. తమ ప్రాపర్టీ 22-ఏలో ఉందన్న విషయం చాలామంది సామాన్యులకు తెలియడం లేదు. తీరా రిజిస్ట్రేషన్ కోసం చలాన్లు కట్టి, డబ్బులు చెల్లించిన తర్వాత భూమి 22ఎలో ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నారు. పైగా రిజిస్ట్రేషన్ కోసం కట్టిన చలాన్ డబ్బులు కూడా వాపస్ ఇవ్వకుండా ప్రభుత్వం ప్రజల సొమ్మును నిలువునా దోచుకుంటోందని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి వచ్చిన భూములకు బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి. ఇప్పుడు అవే భూములను తీసుకొచ్చి 22ఎలో పెట్టడంతో అటు ప్రజలు. ఇటు బ్యాంకులు ఇద్దరూ ఆగం అవుతున్నారు. బంజారాహిల్స్ హౌసింగ్ సొసైటీ లాంటి ప్రాంతాలను సైతం ప్రొహిబిషన్ లో పెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 30 శాతం కమీషన్ లేనిదే రెవెన్యూ శాఖలో ఒక్కఫైల్ కూడా కదలడం లేదని ఆరోపించారు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22ఎ ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది. తన సొంత ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావిడి మొదలైందన్నారు. సీఎంకు చురుకు తగిలితేనే కానీ సామాన్యుల బాధలు పట్టవా.. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి.. వాళ్ల గోడు ఎవరు వినాలి.. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. తప్పు జరిగినప్పుడు తక్షణమే ఆ భూములను 22ఏ నుంచి తొలగించాలి. కానీ రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి.. కమీషన్ల కోసమేనా.. అసలు ఈ ప్రాపర్టీలను అందులో ఎవరు పెట్టారు.. కమీషన్లు తీసుకుని ఎవరు తొలగిస్తున్నారు.. దీనిపై తక్షణమే విచారణ జరగాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 7, 2023 నుంచి భూములను ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టిన వివరాలు ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలి. అప్పటిలోగా ఈ ఆస్తులన్నింటినీ దాని పరిధి నుంచి మినహాయించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

మీ తప్పులకు అధికారులు బలి కావాలా?

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను బంద్ చేయాలనే కుట్ర బయటపడటంతో ఆ తప్పును అధికారులపైకి నెట్టే ప్రయత్నం మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. 22ఏ నిషేధిత భూముల విషయంలో భూదందా వెలుగులో రావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ‘సారీ’ అంటూ తప్పించుకుని అధికారులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ సరిదిద్దుకోలేని తప్పు చేసి సారీ చెప్పి తప్పించుకుంటే సరిపోదన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇక రావేమోనని పేదలు ఆందోళన చెందుతున్నార న్నారు. 22ఏ నిషేధిత భూముల వ్యవహారంతో ఎంతోమంది మానసిక వేదనకు గురయ్యారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడం కాదు.. మీ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యంపై ముందు చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ప్రభుత్వ అధికారులపై మీరు సీరియస్‌గా ఉండటం కాదు.. ప్రజలు మీ ప్రభుత్వంపై సీరియస్‌గా ఉన్నారన్నారు. ఎన్నిసార్లు సారీ చెప్పినా ప్రజలకు ఒరిగేదేమీ లేదంటూ కళ్యాణలక్ష్మి పథకం ఆగకూడదు.. నిషేధిత జాబితా నుంచి భూహక్కుదారుల భూములను తొలగించి, వారికి పూర్తి హక్కులు కల్పించాలి అని డిమాండ్ చేశారు.

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం కావడం హర్షణీయం

పేదవారికి కూడా కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించాలన్న సమున్నత ఆశయంతో కేసీఆర్ రూపకల్పన చేసిన సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షణీయం అన్నారు. ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశలా టిమ్స్ హాస్పిటల్స్ ఉండాలన్న ఉదాత్తమైన ఆలోచనతో కేసీఆర్ వీటికి శంకుస్థాపనలు చేయడమే కాక బీఆరఎస్ హయాంలోనే శరవేగంగా నిర్మాణ పనులను చేపట్టారని తెలిపారు. ఒక్క సనత్ నగర్ టిమ్స్‌లోనే వెయ్యి పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగం, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్‌రే, క్యాథ్‌ల్యాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ సెంటర్ వంటి అన్ని విభాగాలు ఒకేచోట ఉండటం రోగులకు వెలకట్టలేని వరం అన్నారు. హైదరాబాద్ వాసులకేకాక జిల్లాల నుంచి ప్రాణాపాయ స్థితిలో రాజధానికి వచ్చే రోగులకు కూడా ఈ టిమ్స్ ఒక సంజీవనిగా సేవలందించనుందన్నారు. నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లకు, సేవలందించే వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బందికి హరీష్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ కక్షతో ఇన్నాళ్లు జాప్యం చేసిన కాంగ్రెస్ సర్కారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌ను కూడా త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *