– పరిశ్రమల శాఖపై సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, మే 11 : తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ అధికారులతో, ప్రాజెక్టు కన్సల్టెంట్లతో రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమల శాఖపై ఆయన సోమవారం సమీక్షించారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి వివిధ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు ఆస్తకి చూపుతున్నారని, ఆ దిశలో పరిశ్రమల శాఖ అధికార యంత్రాంగం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని, తగు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని పారిశ్రామికవేత్తలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎంవోయÖలతోపాటు పెట్టుబడిదారులకు అవసరమైన ఇతర మౌలిక వసతులను సమకూర్చాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలతోపాటు ఆయా రంగాలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కూడా పెట్టుబడుదారులకు తెలియపరిచి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని సీఎస్ పేర్కొన్నారు. భారీ పెట్టుబడులతోపాటు స్థానిక యువతకు అధికస్థాయిలో ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫార్మా రంగం, చేనేత ఉత్పత్తులు, టెక్స్‌టైల్ పార్కులు, ఐటి పరిశ్రమలు, డేటా సెంటర్లు, డ్రైపోర్టులు సంబంధిత రంగాల్లో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారని, తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌కు వారు ఆకర్షితులవుతున్నందున అధికార యంత్రాంగం కూడా తగు కార్యాచరణ ప్రణాళికతో వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ తదితర ఐటీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని అధికారులు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం, డెయిరీ ఉత్పత్తుల రంగంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. వివిధ రంగాలలో పెట్టుబడులతోపాటు యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





