– కేంద్ర సహకారం తప్పనిసరి
– రాష్ట్ర ప్రాజెక్టుకు అనుమతులను మాత్రమే కోరాం
– రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా పోరాటం
– బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ
‘- సర్’ పేరుతో రాష్ట్రాల్లో చొరబడే యత్నం
– జెమిని సర్కస్‌లా బీజేపీ ఎన్నికల విధానం
– మోదీ పాలానానుభవ రాహిత్యంతో దేశానికి నష్టం
– మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కేంద్ర సహకారం అవసరమని తెలిపారు. అభివృద్ధి విషయంలో కలిసి పనిచేద్దామని ప్రధాని చెప్పారని, తమ మధ్య జరిగిన చర్చ పూర్తిగా అభివృద్ధికి సంబంధించినదేనని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం తాము కేంద్రంతో పోరాడుతామని కూడా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విధానాలు, రాష్ట్ర అభివృద్ధి, మావోయిస్టుల లొంగుబాట్లు, మహిళా రిజర్వేషన్లు, రీజినల్ రింగ్ రోడ్, బండి భగీరథ్ కేసు వంటి అనేక కీలక అంశాలపై స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హెచ్ఐసీసీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాను ప్రస్తావించిన అభివృద్ధి అంశాలను ప్రధాని మోదీ అంగీకరించారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర సహకారం అవసరమని, అదే విషయాన్ని తాను మోదీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ’నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని.. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని నిధులు అడగలేదని, తాము మాత్రం రాష్ట్ర హక్కుల కోసం అడుగుతున్నామని పేర్కొన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధాని మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రధాని అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆయన పిలుపులో రాజకీయాలకు తావులేదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్‌లాగే విజన్ 2047 సాధనకు, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలన్నారు. తమ పార్టీలు, ఐడియాలజీ వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఎన్నోసార్లు కలిసినా కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని, 2 గంటలు సమయమిస్తే తమ ప్రణాళికలు ప్రధానికి వివరిస్తామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మెట్రో, సదరన్ పార్ట్ రీజినల్ రింగ్ రోడ్ వంటి కొన్ని ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఎయిర్‌పోర్టు క్లియరెన్స్‌లు, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ ప్రాజెక్టుకు ఏడీబీ నిధులు, నేషనల్ హైవేలకు అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తాను ప్రధాని మోదీని కోరగా ఆయన అంగీకరించారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బీజేపీని’బ్రిటిష్ జనతా పార్టీగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. విభజించి పాలించడం ఆ పార్టీ సిద్దాంతమని ఆరోపించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, మావోయిస్టులు కూడా ఈ దేశ ప్రజలేనని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. బీజేపీ సిద్దాంతాన్ని వ్యతిరేకించిన వారిని ఖతం చేయడం వాళ్ల విధానమని విమర్శించారు. తమ సిద్దాంతాన్ని వ్యతిరేకించిన వారిని ఒప్పించి జనజీవనంలో కలపడం కాంగ్రెస్ విధానమని వ్యాఖ్యానించారు. విదేశీ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కేంద్రానికి స్పష్టమైన విధానం లేదన్నారు. జెమిని సర్కస్‌లా బీజేపీ ఎన్నికల విధానం ఉంటుందని ఎద్దేవా చేశారు. అనుభవరాహిత్యం, అహంకారం వల్లనే దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ఎసఐఆర్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. కేరళంలో మÖడు సీట్లు, తమిళనాడులో ఒక సీటు మాత్రమే బీజేపీ గెలుచుకుందని ప్రస్తావించారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎసఐఆర్‌ను ప్రయోగిస్తున్నారని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ రాలేదని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏమిటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రెండు సీట్లతో ప్రారంభమైందని, అక్కడికే వస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌ను మోదీ విమర్శిస్తే తనను విమర్శించినట్లేనని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఆశించిన మేరకు సహకారం లేదని చెప్పారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని మండిపడ్డారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం అతిపెద్ద పార్టీని గవర్నర్ ఆహ్వానించకుండా నిర్లక్ష్యం ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ జపం చేయకుండా బీజేపీ బతకదని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





