ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం

– ‘ప్రజావాణి’ని పరిశీలించిన మంత్రి పొన్నం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజావాణికి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 2బీహెచ్‌కే గృహాలు, రెవెన్యూ, మున్సిపల్, సంక్షేమం తదితర వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించి, అర్హులైన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రవాసి ప్రజావాణి ద్వారా విదేశాల్లో ఉపాధి, ఉద్యోగాలు, ఇతర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజల వినతులను కూడా మంత్రి పరిశీలించి సంబంధిత శాఖల సమన్వయంతో వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణిలో ప్రజల నుంచి రోజూ అందుతున్న వినతులు, వాటి పరిష్కార స్థితి, శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్‌లతో మంత్రి మాట్లాడి ప్రజావాణి నిర్వహణ, సమస్యల పరిష్కార ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల సమస్యల ను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, ప్రజావాణిలో వచ్చిన ప్రతీ వినతికి పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కారం అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి పొన్నం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *