వేగంగా వైఐపీ స్కూల్ నిర్మాణం

– వచ్చే సంవత్సరం నుంచే అకడమిక్‌ బ్లాక్‌- I తరగతులు
– డీజీపీ ఆనంద్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ (వైఐపీఎస్‌) అకడమిక్‌ బ్లాక్‌-1 నిర్మాణ పనులను వేగవంతం చేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి తరగతుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని డీజీపీ సి.వి.ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంచిరేవులలో పాఠశాల నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. పలు పనులకు అనుమతులు ఇస్తూ ఇతర అంశాలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అకడమిక్‌, మౌలిక సదుపాయాలు, సీఎస్ఆర్‌, నియామకాలు, ఆర్థిక వ్యవహారాల కమిటీల పనితీరును సమీక్షించారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టాలని సూచించారు. నాణ్యమైన తరగతి గదులతోపాటు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు క్రమశిక్షణ, కెరీర్‌ మార్గదర్శకత్వం ఎంతో అవసరమని డీజీపీ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల ప్రభావం లేని వాతావరణంలో విద్యాబోధన ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్‌ స్కూల్‌ ప్రత్యేకతను చాటుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో కూడిన విద్య, నాణ్యమైన బోధన, సరైన మార్గదర్శకత్వం ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నారు. పోలీసు కుటుంబాల పిల్లలతోపాటు సాధారణ పౌరుల పిల్లలకూ అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించే ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాఠశాలలో 345 మంది విద్యార్థులు 6వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారని అధికారులు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరానికి సుమారు 720 మంది విద్యార్థులకు ప్రవేశాలు, మొత్తం 1000 మంది విద్యార్థులకు విద్య వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిజిపి సూచించారు. సమావేశంలో శాంతిభద్రతల డీజీ మహేష్‌ భగవత్‌, ఆక్టోపస్‌ డీజీ అనిల్‌కుమార్‌, ఐజీపీ ఎల్.గజరావు భూపాల్, సిద్ధిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాళ్, ఏజీ అడ్మిన్ రమణ కుమార్, డీసీపీ సీహెచ్‌.శ్రీనివాస్‌, విశాల్‌ గోయల్, ప్రిన్సిపాల్‌ అనితారెడ్డి, జయకుమార్‌, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *