– వరద సహాయక చర్యల్లో మీ సేవలు లేనివి
– సిబ్బందిని అభినందించిన మంత్రి పొంగులేటి
– పడవ బోల్తాపడి వరద ఉధృతిలో చిక్కుకున్న 11మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
– అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సహాయక బృందాలు
– సిబ్బందిని అభినందించిన మంత్రి పొంగులేటి
– పడవ బోల్తాపడి వరద ఉధృతిలో చిక్కుకున్న 11మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
– అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సహాయక బృందాలు
సత్తుపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 5 : సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో వరద ఉధృతిలో పడవ బోల్తా పడిన ఘటనలో బుధవారం రాత్రంతా వరదలో చిక్కుకున్న 11మంది ఎస్టీఆర్ ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అభినందించారు.బుధవారం రాత్రి భారీ వర్షాలు, వరదలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది సేవలు మరువలేనివని రెవెన్యూ, గృహ నిర్మాణం శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. బేతుపల్లి చెరువు ఉప్పొంగిన ప్రాంతంతోపాటు దమ్మపేట మండలంలోని పలు గ్రామాలకు వరద ముప్పు ఏర్పడిన సమయంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించి చేపట్టిన సహాయక చర్యలను అభినందించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి మంత్రి పొంగులేటి బేతుపల్లి పెద్ద చెరువు వద్ద పరిస్థితిని గురువారం పరిశీలించారు. అనంతరం దమ్మపేట మండలంలో మల్లెపూల వాగు, ముసలిబంధం చెరువుల వద్ద గండ్లు పడిన ప్రాంతాలను సందర్శించి వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వారికి శాలువాలు కప్పి సత్కరించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమన్నారు. విధి నిర్వహణలో చూపిన తెగువకు ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు.
గల్లంతైన 11 మంది సురక్షితం 

బేతుపల్లి చెరువులో బుధవారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసినప్పటినుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరంతర పర్యవేక్షించారు. బుధవారం రాత్రి పడవ బోల్తాపడి వరద ఉధృతిలో చిక్కుకున్న 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో పదిమందిని సహాయక బృందాలు తొలుత సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. అనంతరం గల్లంతైన మరో సిబ్బంది ఆచూకీ లభ్యమవడంతో అతడిని కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఖమ్మం పోలీస్ కమిషనర్, రెవెన్యూ, పోలీస్, రెస్క్యూ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. అర్ధరాత్రి దాటే వరకు సహాయక చర్యలను ఫోన్ ద్వారా నిరంతరం పర్యవేక్షించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి కల్లూరు మండలం నారాయణపురం చేరుకున్నారు.
సహాయక సిబ్బందికి భట్టి విక్రమార్క అభినందనలు
హైదరాబాద్ : బేతుపల్లి చెరువులో గల్లంతైన పదిమంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు ఒక స్థానిక వ్యక్తిని సురక్షితంగా రక్షించడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. రాత్రంతా అవిశ్రాంతంగా కొనసాగిన సహాయక చర్యల అనంతరం మొత్తం 11 మందిని క్షేమంగా బయటకు తీసుకురావడం ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆరఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి సేవలను ప్రశంసించారు. రాత్రంతా సహాయక చర్యలను భట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. గల్లంతైన వారందరినీ సురక్షితంగా కాపాడటంతో వారి కుటుంబ సభ్యులతోపాటు అందరిలోనూ ఆందోళన తొలగి ఉపశమనం కలిగిందని ఆయన అన్నారు.
———————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




