– రోహిణి ప్రవేశంతో ఎండలు మరింత తీవ్రం
– పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది. ఘట్‌కేసర్‌లో వడగళ్ల వర్షం కురిసింది. మెదక్, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షం పడింది. దీంతో ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. మెదక్ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. గంగినేని థియేటర్ వద్ద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మెదక్ మార్కెట్ యార్డులో ధాన్యం బస్తాలు తడవడƒంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ర్యాలమడుగులో ఈదురుగాలుల తీవ్రతకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పడిపోయింది. మంభోజిపల్లిలో 3 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, రోహణి కార్తే సోమవారం నుంచే ప్రారంభం అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తె ప్రవేశించిన వేళ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తెలంగాణ ప్రణాళికా సంఘం సోమవారం విడుదల చేసిన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత 45 నుండి ఏకంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో జనం ఇళ్ల నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే మొదలవుతున్న ఎండ తీవ్రత మధ్యాహ్నానికి నిప్ప్పుల కొలిమిని తలపిస్తోంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట, మంచిర్యాల జిల్లాల్లో 46.4 డిగ్రీలు, నల్గొండ, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 46.3 డిగ్రీల చొప్ప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో 46.2 డిగ్రీలు, జగిత్యాలలో 46.1 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో 45.9 డిగ్రీలుగా ఎండ తీవ్రత నమోదైంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేసి రెడ్ అలర్ట్ పరిధిలోకి వచ్చేశాయి.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా చుట్టుపక్కల మేడ్చల్`మల్కాజ్‌గిరిలో 42.4, రంగారెడ్డిలో 43.1, సంగారెడ్డిలో 42.1 డిగ్రీల చొప్ప్పున ఎండలు ఉన్నాయి. కేవలం నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మాత్రమే నిన్నటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదై కాస్త ఉపశమనం కలిగించాయి. రాబోయే మÖడు రోజుల వాతావరణ ముందస్తు సూచనలు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవు. రానున్న రోజుల్లో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాల్లో ఎండలు మరింత ముదిరి 45.7 డిగ్రీల వరకు వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



