– ఇవే రేవంత్ లక్షణాలు
– రైౖతులు నీళ్లు కావాలంటే ప్రతిపక్షాల రక్తం చల్లాలంటావా?..
– షాబాద్ హంతకుడికి.. నీకు తేడా ఏముంది?
– 2.60 కోట్ల టన్నుల వరి దిగుబడి ముమ్మాటికీ కేసీఆర్ ఘనతే
– పోలవరాన్ని ముంచిన అధికారులతో మేడిగడ్డపై రిపోర్టులా..
– ఈగో కోసం మోటార్లు ఆపితే థర్మల్ ప్లాంట్లు ఆగిపోవా?
– వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులను కాపాడండి
– మీడియా సమావేశంలో బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : రైతులు సాగునీరు అడిగితే దిగమను, రాయి కట్టుకుని దూకమను.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్టుతో కొట్టాలి అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత జుగుప్సాకరమని మాజీ మంత్రి, బీఆరఎస్ నేత టి.హరీష్‌రావు అన్నారు. హిట్లర్ తనకు ఆదర్శం అన్న ఆయన అదే హిట్లర్ తరహాలో హంతక భాష మాట్లాడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్‌లో ఆయన చెప్పిన మాటల్లో పచ్చి అబద్ధాలు, బూతులు, శాడిజం అనే మÖడు లక్షణాలు స్పష్టంగా కనిపించాయంటూ ఆయన దాస్తున్న వాస్తవాలను ఆధారాలతో రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నామని హరీష్‌రావు అన్నారు. మొన్నటి వరకు గోదావరిలో నీళ్లే లేవు అని అబద్ధం చెప్పిన సీఎం.. కేటీఆర్ అక్కడికి వెళ్లి పారుతున్న గోదావరిని లైవ్‌లో చూపగానే నాలుక కరుచుకున్నారన్నారు. మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి మోటార్లు ఎలా నడుపుతారని సీఎం అజ్ఞానంతో మాట్లాడుతుంటే పక్కనే ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ మైక్ లాక్కుని సరిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. కన్నెపల్లి మోటార్లు 93.5 మీటర్ల ఎత్తులో నడుస్తాయని, ప్రస్తుతం నదిలో లక్ష క్యూసెక్కుల వరద పోతోందని, నీటిమట్టం 97.5 మీటర్ల ఎత్తులో ఉన్నందున గేట్లు మూయాల్సిన అవసరమే లేదని చెప్పారు. నిన్నటిదాకా నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్లు అన్న సీఎం.. ఇప్పుడు వాళ్లు నీళ్లు ఎత్తమని సాంకేతిక సూచన చేస్తే వారిని జైల్లో పెడతామని బెదిరిస్తున్నారన్నారు. ఏనాడూ రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ ఫీజబుల్ కాదని చెప్పలేదని స్పష్టం చేశారు. మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకెళ్లడం కష్టం కాబట్టి వరుస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా తీసుకెళ్లమని సాక్షాత్తూ వారే జస్టిస్ ఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ ఇచ్చారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు సైతం కేవలం రూ.8.5 కోట్లతో ఒక కాఫర్ డ్యామ్ కట్టుకుని నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్లొచ్చని ప్రభుత్వానికి లేఖ రాశారని, కానీ నీళ్లు ఎత్తిపోయకుండా, మోటార్లు ఆన్ చేయకుండా కాళేశ్వరంపై తాము చేసిన దుష్ప్రచారం బట్టబయలు అవుతుందన్న భయంతో రేవంత్ ఈగోలకు పోతున్నారని హరీష్‌రావు విమర్శించారు. ఎల్లంపల్లిని 20 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ కట్టిందని సీఎం చెప్పడం పచ్చి అబద్ధమని, 2004లో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు మంత్రిగా తన పేరు కూడా శిలాఫలకంపై ఉందని మరోసారి గుర్తు చేశారు. 2014 వరకు రూ.3,347 కోట్లు ఖర్చుపెట్టినా అందులో 5 టీఎంసీల నీళ్లు కూడా నిలపలేకపోయారన్నారు. కాంగ్రెస్ హయాంలో 18,700 ఎకరాల భూసేకరణ, 1448 ఇండ్ల ఆర్ అండ్ ఆర్ మాత్రమే జరిగిందని, బీఆరఎస్ ప్రభుత్వం నది వేల ఎకరాల భూసేకరణ చేసి 13,296 ఇండ్లు కట్టి పునరావాసం కల్పించిందని చెప్పారు. రూ.2052 కోట్లు ఖర్చు చేసి 2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో 20 టీఎంసీలు వినియోగంలోకి తెచ్చిందన్నారు. ఈరోజు ఎల్లంపల్లిలో 7-8 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, ఎన్టీపీసీకి 5, సింగరేణికి 5, హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు అవసరమని చెప్పారు. సీఎం పంతాలకు పోయి నీళ్లు ఎత్తకపోతే రేపు కరెంట్ ఉత్పత్తి ఆగిపోయి రాష్ట్రం అంధకారం అవుతుందని హరీష్‌రావు హెచ్చరించారు. బీఆరఎస్ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని సీఎం అంటున్నారు.. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 6.64 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే 9.5 ఏళ్ల బీఆరఎస్ పాలనలో కాళేశ్వరం, పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని వివరించారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోనే కాంగ్రెస్ 30 ఏళ్లలో 46 వేల ఎకరాలకు ఇస్తే తాము 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. 2014-15లో రాష్ట్రంలో పండిన వరి కేవలం 68 లక్షల టన్నులు. కానీ బీఆరఎస్ ప్రభుత్వ విధానాల 24 గంటల కరెంట్, రైతుబంధు, సాగునీరు వల్ల 2023-24 నాటికి ఏకంగా 2.60 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండిందని చెప్పారు. వరి సాగు 34 లక్షల ఎకరాల నుంచి కోటి 18 లక్షల ఎకరాలకు పెరిగిందని, ఇది ముమ్మాటికీ కేసీఆర్ ఘనత అని చెప్పారు.
భద్రాచలం మునిగిపోతుందనడం శుద్ధ అబద్ధం
అన్నారంలో 5 టీఎంసీలు, సుందిల్లలో 3.8 టీఎంసీలు మొత్తం 8.8 టీఎంసీలు నిలిపితే ఒకవేళ రెండు బ్యారేజీలకు ఒకేసారి ఇబ్బంది వచ్చినా కిందకు వెళ్లేది 1.10 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమేనని హరీష్‌రావు తెలిపారు. 2022లో ఏకంగా 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలం ఏమీ కాలేదు.. అలాంటిది లక్ష క్యూసెక్కులకే భద్రాచలం కొట్టుకుపోతుందని సీఎం చెవిలో పూలు పెడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
కాళేశ్వరంపై ఖర్చు రూ.87వేల కోట్లే
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కొట్టుకుపోయాయని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నారని, వాస్తవానికి ఖర్చు పెట్టిందే రూ.87 వేల కోట్లు అని స్పష్టం చేశారు. ఈ విషయం సీఎం మామ సూదిని పద్మారెడ్డే ఒక వీడియోలో స్వయంగా చెప్పారు, కావాలంటే ఆ వీడియో పంపుతాను చూసుకోండి అని అన్నారు. ఇందులో మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య ఉన్నది కేవలం 10% మాత్రమే. మిగతా 90% సిస్టమ్ మిడ్ మానేరు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అంతా ఇంటాక్ట్‌గా సురక్షితంగా ఉందన్నారు. నిపుణులను, ఆర్మీ ఇంజనీర్లను తెచ్చామని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డికి ఏ సీజన్‌లో పనులు చేయాలో తెలియదని వ్యాఖ్యానించారు. మీరు ఆర్మీ ఇంజనీర్లను తెచ్చి ఇంత పడగొట్టింది ఏంటి.. ఎసఎల్బీసీ కుప్పకూలి ఎనిమిదిమంది చనిపోవడమా.. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడమా.. వట్టెం పంప్ హౌస్ మునిగిపోవడమా.. ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడమా.. ఇవేనా మీ ఆర్మీ ఇంజనీర్ల గొప్పతనం అని హరీష్‌రావు రేవంత్‌ను నిలదీశారు. ఎంపీగా ఉన్నప్పుడు ఎన్‌డీఎసఏ చట్టం రాష్ట్రాల హక్కులు కాలరాయడమే అని వ్యతిరేకించి రాతపూర్వకంగా ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేడు అదే ఎన్‌డీఎసఏ బైబిల్‌లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డపై రిపోర్టు ఇచ్చిన ఎన్‌డీఎసఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, అతుల్ జైన్ 2019 నుంచి 2024 వరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సీఈవోలు. వారి హయాంలోనే పోలవరం కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ ఆరుసార్లు కొట్టుకుపోయి రూ.7 వేల కోట్లకు పైగా నష్టం జరిగింది.. అలాంటివాళ్లకు ప్రమోషన్లు ఇచ్చి ఇక్కడకు పంపితే వాళ్లు మేడిగడ్డ మÖడు పిల్లర్ల కుంగుబాటుపై రిపోర్టులు ఇస్తారా అని ప్రశ్నించారు.
ప్రతీ చుక్క ముఖ్యమే
ఎల్‌నినో కరవు పరిస్థితుల్లో ప్రతి చుక్క ముఖ్యమంటూ ఇప్పుడున్న 50-60 వేల క్యూసెక్కుల వరదను కన్నెపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తుకోవాలని హరీష్‌రావు సూచించారు. దేవాదులలో పది మోటార్లు ఉంటే నాలుగు మాత్రమే నడుపుతూ 2500 క్యూసెక్కులు ఎత్తాల్సినచోట 1200 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతున్నారు.. వరంగల్, ధర్మసాగర్, పాలకుర్తిలలో 75% చెరువులు ఎండిపోయినా పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లు బంద్ పెట్టి నీళ్లు వదిలేస్తూ ఆంధ్రాలోని పట్టిసీమకు మేలు చేస్తున్నారని, ఇది గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్న గురుదక్షిణ అని ఆరోపించారు. పార్టీలు, చొక్కాలు మార్చినట్లు మార్చే రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో 12% కమీషన్లు, రెవెన్యూలో 30% కమీషన్లతో దిల్లీకి కప్పం కడుతున్నారన్నారు. షాబాద్‌లో ఆరుగురిని కిరాతకంగా చంపిన నరహంతకుడు రాజ్‌కుమార్‌కు, ప్రతిపక్షాల రక్తం కావాలంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తేడా కనిపించడం లేదన్నారు. లా అండ్ ఆర్డర్ చూసే ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి నిన్న మధ్యాహ్నం గోల్ఫ్ ఆడుకుంటూ కూర్చున్నాడు.. ఇదీ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి గారూ.. మమ్మల్ని తిడితేనో, జైల్లో పెడితేనో మీ కసి తీరుతుందనుకుంటే మీరు నా రక్తం అడిగినా, జైల్లో వేసినా.. దానికి నూటికి నూరు శాతం తాను సిద్ధం అన్నారు. మీ ఈగోలకు రైతుల పంటలను ఎండబెట్టక తక్షణమే కన్నెపల్లి, దేవాదుల మోటార్లు పూర్తిస్థాయిలో ఆన్ చేసి రాష్ట్రాన్ని కరవు బారి నుంచి కాపాడండి.. క్రెడిట్ మీరే తీసుకోండి అని హితవు పలికారు. లేకపోతే ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటి బొట్టుకు సమాజం రేపు మిమ్మల్ని దోషిగా బోనులో నిలబెడుతుంది.. ఖబడ్దార్ అంటూ హరీష్‌రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





