రేవంత్ మ‌ళ్లీ గెల‌వ‌డం క‌ల్ల

– ఆయ‌న‌ సొంత స‌ర్వేనే బీఆర్ఎస్‌కు 78 సీట్లని తేల్చింది
– గెలుస్తాన‌ని న‌మ్మ‌కముంటే ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి
– కాలేశ్వ‌రం నీటిని ఎత్తిపోయకుండా రైతుల‌పై ప‌గ‌బ‌ట్టిండు
– గోదావ‌రి బేసిన్‌లోని అన్ని రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు నింపొచ్చు
– కాలేశ్వ‌రంతో సంబంధంలేని భ‌ద్రాచ‌లం ఎట్లా మునుగుతుంది?
– నీళ్లు కిందికి వ‌దిలేస్తున్న రేవంత్ రైతు ద్రోహి
– మీడియాతో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 11: రేవంత్ రెడ్డి తిరిగి ఎన్నికయ్యేది కల్ల అని కేటీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే 78 సీట్లు వస్తాయని చెప్పింది ముమ్మాటికి వాస్తవమన్నారు. ముఖ్యమంత్రి తాను సర్వే చేయించుకోలేదు అన్న విషయం నిజమైతే ఆ మేరకు దేవుడిపైన ఒట్టు వేసి చెప్పాలన్నారు. తన పాలన పట్ల అంత నమ్మకం ఉంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు లేదంటే అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఉప ఎన్నికలకు ఎన్నికలకు పోయే పోవాలని పిస్తున్నారు. రేవంత్ రెడ్డికి నీళ్లు ఎత్తిపోయడం తెలవదు, కేవలం సంచులలో పైసలు నింపి ఢిల్లీకి కట్టే ఈఎంఐ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.  నిజంగానే బీఆర్ఎస్ పార్టీని ఆపగలిగే శక్తి ఉంటే వెంటనే రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలో, లేదంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల ఉపఎన్నికలో లేదా మొత్తం శాసనసభను రద్దు చేసే అసెంబ్లీకి ఎన్నికలు పెడితే దమ్ము ఉన్నదా అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ స‌ర్వేతో పాటు మరో మూడు, నాలుగు సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెప్పిన విషయాన్ని కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు.  లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతుంటే తెలంగాణని కరువు కాటకాల ముందు నిలబెట్టే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాలేశ్వరంలో మేడిగడ్డతో సంబంధం లేకుండా మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం రైతన్నలకు ప్రజలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మూర్ఖత్వంతో తెలివితక్కువతనంతో గత ప్రభుత్వం పైన ద్వేషంతో పంటలను ప్రజలను ఎండబెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని అక్కడ పారుతున్న నదిని ప్రజలకు చూపించడంతోనే తన బండారం బయటపడడంతో రేవంత్ రెడ్డికి పిచ్చి లేసిందని దీంతో అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. ఒకవైపు ప్రజలు రిటైర్డ్ ఇంజనీర్లు పార్టీలు నీటిని ఎత్తిపోసి రానున్న కరువును ఆపాలని డిమాండ్ చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ నీళ్లను తన గురువు కోసం కిందికి వదిలిపెడుతున్నారని విమర్శించారు భద్రాద్రి రాముడు తో భద్రాచలంతో ఎలాంటి కాలేశ్వరం నీటిని వరద పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఇస్తున్నారన్నారు.  గోదావరి బేసిన్ లో ఉన్న రిజర్వాయర్ల స్టోరేజీ కూడా సగానికి పైగా ఖాళీగా ఉంది. మరోవైపు కన్నెపల్లి దగ్గర లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతుంది. రానున్న అక్టోబర్ వరకు కూడా ఈ లక్షల క్యూసెక్కుల నీరు కిందికి వృధాగా పోయే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగానే రైతుల పట్ల, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ నీటిని రానున్న 100 రోజుల పాటు కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ప్రారంభించి ఎత్తిపోస్తే గోదావరి బేసిన్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది.  కాంగ్రెస్ ప్రభుత్వానికి మా పైన కోపం ఉండవచ్చు లేదా ద్వేషం ఉండవచ్చు. కానీ తెలంగాణ ప్రజల పైన, రైతన్నల పైన అక్కసు పెట్టుకోకుండా కిందికి పారుతున్న నీటిని ఎత్తిపోస్తే అందరికీ మంచి జరుగుతుంది. రేవంత్ రెడ్డి మాత్రం మేడిగడ్డ బ్యారేజీ పేరు చెప్పి అది కూలిపోతుంది అని ప్రజలను మభ్యపెడుతూ, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేస్తూ కిందికి నీళ్లను పంపిస్తుంటే.. పక్క రాష్ట్రం వాళ్ళు మాత్రం పట్టిసీమ పంప్ హౌస్ ద్వారా, పంపుల ద్వారా భారీగా నీటిని తోడుకుంటున్నారు. మేడిగడ్డతో ఎలాంటి సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఒక్క గేటు కూడా మూయకుండానే, కన్నెపల్లి నదీ ప్రవాహం దగ్గర 93 మీటర్ల ప్రవాహం నమోదైన ప్రతిసారి భారీగా నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. ప్రతిరోజు ఒక హుస్సేన్ సాగర్ లో ఉన్న స్థాయిలో ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఈరోజు దాదాపు 97 మీటర్ల నదీ ప్రవాహం కన్నెపల్లి దగ్గర పారుతున్నది. దీన్ని కేవలం ఒక్క బటన్ ద్వారా పంపులు ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తే తెలంగాణ కరువు నుంచి దూరం అవుతుంది. ರಾనున్న 100 రోజుల పాటు కనీసం 200 టీఎంసీల నీటిని గోదావరి బేసిన్ లో ఉన్న రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు నింపవచ్చు. మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి, మల్కపేట, బస్వపూర్ రిజర్వాయర్లు అన్నీ నిండుతాయి. దీంతో సగం వ్యవసాయ సంక్షోభం, తాగునీటి సంక్షోభం రాకుండా చూసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి కేవలం మతిలేని మాటలు మాట్లాడుతూ కరువు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మేడిగడ్డకు, కన్నెపల్లికి లింకు పెట్టి బోడి గుండుకు మోకాలికీ ముడి వేసినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికే అన్నారం, సుందిళ్ల విషయంలో కూడా గ్రౌటింగ్ పూర్తయింది. అక్కడ సురక్షితంగా నీటిని నిల్వ చేసి వాడుకోవచ్చు అని ప్రభుత్వంలోని ఇంజనీర్లే స్పష్టం చేస్తున్నారు. మేడిగడ్డ గేట్లు మూసి నీళ్లు ఎత్తాలని ఏనాడు మేము చెప్పలేదు. కన్నెపల్లి ద్వారానే భారీగా నీళ్లు ఎత్తిపోసుకోవచ్చని చెప్పిన విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ముంగిట నిలబడ్డది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రాజెక్టులను, నీళ్లు ఎలా నింపుకోవచ్చో ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డకు సంబంధమే లేని, ఎక్కడో సుదూరాన ఉన్న భద్రాచలం రాముడితో పాటు 44 ఊర్లు నిండిపోతాయని, మునిగిపోతాయని అబద్ధాలు చెప్తున్నాడు. ఇదే మేడిగడ్డ గత 500 సంవత్సరాలలో ఎప్పుడూ రానంత భారీగా 28.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా కొట్టుకుపోకుండా గట్టిగా నిలబడింది. అలాంటిది లక్ష క్యూసెక్కుల నీటిని తట్టుకోదు అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. 2022 నాటి వరద ఫోటోలు చూపించి కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిందని అబద్ధాలు చెప్తున్నారు.రేవంత్ రెడ్డి చెప్పినట్లు కన్నెపల్లి దగ్గర నీళ్లు లేకుంటే, మరి కిందికి పోతున్న ఆ నీటితోనే పక్క రాష్ట్రంలోని పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది? వందల టీఎంసీలను ఎలా ఎత్తిపోస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలే. కేవలం తన తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే తన గురువుకి కోపం వస్తుందనే రేవంత్ రెడ్డి లేనిపోని అబద్ధాలు చెబుతున్నారు. భద్రాచలానికి ప్రమాదం ఉంది అంటే అది ముమ్మాటికి పక్క రాష్ట్రం కడుతున్న పోలవరంతోనే కానీ, కాళేశ్వరంతో కాదు. అయినా పోలవరం గురించి గట్టిగా మాట్లాడితే తన గురువుకి కోపం వచ్చి ఇబ్బంది అయితదని రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు.  రాష్ట్ర రైతాంగం కింద పారుతున్న నీటిని ఎత్తిపోయాలని కోరుతుంటే, కిందికి వదిలేస్తున్నోడు బుర్ర తక్కువ వాడు కాదా అని ప్రశ్నించారు.   పక్క రాష్ట్రం వాళ్ళు పంప్ హౌస్‌లు ప్రారంభించుకొని నీళ్లు ఎత్తిపోసుకుంటే, కన్నెపల్లి పంప్ హౌస్‌కి తాళం వేసిన దరిద్రుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం మాత్రమే కాకుండా దేవాదుల పంపులు కూడా ప్రారంభించకుండా వరంగల్ జిల్లా రైతుల నోట్లో మట్టి కొడుతున్న రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పంప్ హౌస్‌లు ప్రారంభించి, నీళ్లను ఎత్తిపోయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తిరగబడతారు అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి సాగునీటి రంగంలో చేస్తున్న ద్రోహానికి చరిత్రహీనుడుగా, రైతు ద్రోహిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిపోతుంది అన్నారు. వర్షాలు పడకున్నా గోదావరిలో నది నీళ్లు కిందికి పారుతున్నా పట్టించుకోకుండా కావాలనే రైతాంగంపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ఇంకో రెండు, మూడు వారాలు చూసి పార్టీగా ఒక భారీ కార్యాచరణ ప్రకటిస్తాం అని కేటీఆర్ తెలిపారు. హరీష్ రావు  గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన క్రమశిక్షణ కలిగిన సైనికుడని, పార్టీ ప్రారంభం నుంచి ఆయనకి అండగా నిలబడ్డ నాయకుడు అన్నారు. ఆయన పైన ఇలాంటి చిల్లర పుకార్లు ఎన్నో సార్లు వచ్చాయని వాటికి ఆయన స్పష్టంగా పలుమార్లు సమాధానం ఇచ్చారు అన్నారు. అయినా రేవంత్ రెడ్డి లాంటి పార్టీలు మారే వ్యక్తి ఇతరుల గురించి మాట్లాడడం… సిగ్గుచేటు అన్నారు. పొద్దున లేస్తే కాంగ్రెస్ తో, అర్ధరాత్రి అయిన తర్వాత బీజేపీతో కలిసి ఉండే రేవంత్ రెడ్డి ఇతరుల గురించి మాట్లాడడం ఆపాలన్నారు. అర్ధరాత్రి కాగానే తనపై కేసుల భయంతో బీజేపీ కాళ్ళు పట్టుకునే రేవంత్ రెడ్డి ఇతర పార్టీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు’.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *