– ప్రతీ గింజను కొనేదాకా వెంటాడుతూనే ఉంటాం
– ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
– పాండురంగ కుటుంబానికి రూ.3 లక్షల సాయం
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతాంగానికి శాపంగా మారనుందని బీఆ ర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయకుంటే కాంగ్రెస్ నాయకుల కాళ్లు పట్టుకోవద్దని, వారి కాలర్ పట్టుకుని నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామానికీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకెళ్లాలని, రైతులను చైతన్యవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తన జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇటీవలి కేబినెట్ సమావేశపు నిర్ణయంపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధును ఎగగొట్టిన రేవంత్ రెడ్డి మరోసారి పంటలు అదనంగా కొనుగోలు చేయమని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆనాడు సమైక్యాంధ్రలో తెలంగాణ రైతులను అరిగోసపెట్టిన రోజులను రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేస్తున్నారన్నారు. అనాడు రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర నెంబర్ వన్‌లో ఉంటే తెలంగాణ నంబర్ 2లో ఉండేదన్నారు. అంతటి దుర్భరమైన పరిస్థితి నుంచి తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన కేసీఆర్ పాలనను కేటీఆర్ గుర్తు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రామ్ రామ్ చెబుతుంది అని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమై రైతాంగానికి శాపంగా మారే నిర్ణయం తీసుకుందని కేటీఆర్ ఆరోపించారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు, జొన్నలు, శనగలు, కందులు, సోయాబీన్ తదితర పంటలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయబోదని, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా మేరకే కొనుగోళ్లు ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు.
15 రోజుల క్రితం చెప్పిన మాట ఏమైంది?
మోదీ మెడలు వంచుతా.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా అని 15 రోజుల క్రితం చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు మాట మార్చారని పశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ ఏమైంది.. హామీ ఇచ్చిన కొనుగోలు కేంద్రాలు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, పంటల కొనుగోలు సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. రైతుబంధు నిలిచిపోయిందని, రైతుల పంటల కొనుగోలుకు వినియోగించాల్సిన నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో ప్రతీ గింజ కొనుగోలు
గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నల కోసం ముఖ్యంగా పంట కొనుగోళ్ల విషయంలో చేసిన కృషిని కేటీఆర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ మంత్రివర్గంతో కలిసి దిల్లీ వెళ్లి ధర్నా చేసి రైతుల ప్రయోజనాలను కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు, రైతు బీమా, రుణ మాఫీ, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా 70 లక్షల మంది రైతులకు రూ.లక్ష కోట్లకుపైగా ప్రయోజనాలు అందించామన్నారు. పంటల ఉత్పత్తిలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టామని, ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి మొదటి స్థానంలో నిలిచామని కేటీఆర్ వివరించారు. రాష్ట్రాన్ని సాధించిందే రైతుల కోసం అని, రైతుల సంక్షేమం కోసం ఎంత చేసినా తక్కువేనని భావించి కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.
బీజేపీ ఎంపీలను కూడా నిలదీయాలి
రాష్ట్రంలో ఉన్న ఎనిమిదిమంది కాంగ్రెస్, ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు రైతుల సమస్యలపై స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ ప్రజలు గెలిపించిన బీజేపీ ఎంపీని కూడా ప్రశ్నించాలన్నారు. మోదీ ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వడ్లు, జొన్నలు, కందులు, సోయాబీన్ ఎందుకు కొనడం లేదు అని ప్రశ్నించాలని రైతులకు సూచించారు.
పాండురంగ కుటుంబానికి పరామర్శ
సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరఫున రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పాండురంగ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఆయన ముగ్గురు పిల్లల విద్య, భవిష్యత్తు బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను అనాథలను చేయవద్దని సూచించారు. పాండురంగ మరణం వ్యవసాయ సంక్షోభానికి అద్దం పడుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.3,720 వస్తుందని ఆశించి నెల రోజులపాటు మార్కెట్ యార్డులో జొన్నల కుప్ప వద్ద పాండురంగ వేచి చూశాడÁని, చివరకు క్వింటాల్‌కు రూ.50 లంచం అడిగే పరిస్థితి ఏర్పడగా అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయి తన పంట కుప్పపైనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన రూ.500 బోనస్ అమలు చేయకపోవడంతో రైతులు ప్రైవేటుగా జొన్నలను క్వింటాల్‌కు రూ.2,000కే విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పాండురంగ కుటుంబానికి ఉన్న రూ.1.5 లక్షల రుణం ఇప్పటికీ మాఫీ కాలేదని, రైతుబంధు మూడు విడతలు బకాయి ఉందని, రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో దాదాపు ఏడు వేల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. రైతులవి ఆత్మహత్యలు కావని.. కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలని కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లు ధైర్యంగా ఉండండి. మళ్లీ కేసీఆర్ వస్తారు. ఒక్కో రైతన్నను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు. మీకు అండగా ఉంటాం. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూనే ఉంటాం అని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పార్టీ నాయకులు జాన్సన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




