-మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
– రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన
సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్ 20: కృష్ణా నది ఒడ్డున నివసిస్తున్నప్పటికీ సాగునీటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా దొండపాడు సమీపంలో నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.394 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పథకం పూర్తయిన తర్వాత ముక్తేశ్వరాపురం మేజర్, గణపురం మేజర్ ఆయకట్టుల పరిధిలోని 14100 ఎకరాలకు కృష్ణా జలాలు అందనున్నాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 35 ఎకరాల రైతుల భూములను కొనుగోలు చేసి వారికి రూ. 17.50 కోట్లు నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. కృష్ణా నది పక్కనే ఉన్నా సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు. ఈ పథకం ద్వారా మేళ్లచెరువు మండలం కందిబండలో 2,494 ఎకరాలకు, రామాపురంలో 3,826 ఎకరాలకు, చింతలపాలెం మండలం హుజూర్నగర్ ప్రాంతంలో 149 ఎకరాలకు, దొండపాడులో 1,589 ఎకరాలకు, కోదాడ మండలం గణపవరంలో 2,437 ఎకరాలకు, కూచిపూడిలో 1,060 ఎకరాలకు, ఎర్రవరం, రామలక్ష్మిపురం, బిక్య తండా గ్రామాలకు 1,634 ఎకరాలకు, తొగర్రాయిలో 831 ఎకరాలకు, చిలుకూరు మండలంలో 80 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మొత్తం 22 కి.మీ ప్రెషర్ మెయిన్ పైప్‌లైన్‌లో ఇప్పటికే 16 కి.మీ మేర పైపుల తయారీ పూర్తికాగా, 6 కి.మీ మేర పైపుల ఏర్పాటు పూర్తి అయిందని తెలిపారు. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. సాగునీటి పంపిణీలో ఎలాంటి అసమానతలు లేకుండా ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాల్వల చివరి ప్రాంతాల్లోని రైతులు కూడా లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పథకంతో సాగునీటితో పాటు చెరువులు నిండుతాయని, తద్వారా భూగర్భ జల మట్టం పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, వ్యవసాయ అవసరాలకు దీర్ఘకాలిక భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి ప్రధాన జీవనాడిగా ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం వంటి అనుబంధ ప్రాజెక్టులు నీటి పంపిణీలో ఉన్న లోటుపాట్లను అధిగమించి రైతులకు మరింత భరోసా కల్పిస్తాయని మంత్రి తెలిపారు. సాగునీటి రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఎకరాకు నీరు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే.నరసింహ, ఇరిగేషన్ ఎస్ఈ నాగభూషణం, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, వంగవీటి రామారావు, సర్పంచ్‌లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పలు రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన
కాగా, చింతలపాలెం మండలంలో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన మేళ్లచెరువు-చింత్రియాల రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించారు.
రూ.2.20 కోట్ల వ్యయంతో నిర్మించే మట్టంపల్లి మండలం కమంచికుంట తండా-చెన్నాయిపాలెం రహదారికి, రూ.4.20 కోట్లతో నిర్మించే చౌటుపల్లి-అల్లిపురం రహదారికి, రూ.3.10 కోట్లతో నిర్మించే బక్కమంతులగూడెం-అల్లిపురం రహదారి పనులకు, గరిడేపల్లి మండలం వెంకట్రామాపురం-సీతారాంపురం రహదారి నిర్మాణానికి (రూ.5.10 కోట్లతో) శంకుస్థాపన చేశారు. గరిడేపల్లి మండలం పరెడ్డిగూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌లో అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హుజూర్‌నగర్ ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్ అండ్ బీ కార్యాలయం, నీటిపారుదల శాఖ కార్యాలయ భవనాల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




