– ప్రజారోగ్యమే అభివృద్ధికి అసలైన సూచిక
– వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉండాలి
– వ్యాధి చికిత్స కంటే నివారణే మిన్న
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ప్రజల ఆరోగ్యమే అభివృద్ధికి అసలైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియా హెల్త్ సమిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆరోగ్యం అనేది కేవలం ఒక ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదని, ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా కుప్పకూలుతుందని, వారి జీవితాంతం దాచుకున్న పొదుపు మొత్తం ఒక్క క్షణంలో కరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడు ఎలాంటి భయం లేకుండా ఆహాస్పిటల్‌లో అడుగుపెట్టేలా తక్కువ ధరకు వైద్యం అందుబాటులో ఉండాలన్నారు. దేశం ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలోనే తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఎయిమ్స్ వంటి ఉన్నతమైన వైద్య విద్యాసంస్థలను స్థాపించి దేశానికి ఒక దిశను చూపించారన్నారు. పేద దేశంలో వైద్యం అనేది విలాసంగా మారకూడదనే ఉద్దేశంతో ఆనాడు పునాది వేశారన్నారు. 1975లో ఇందిరా గాంధీ తీసుకొచ్చిన సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకాన్ని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ హయాంలో తీసుకొచ్చిన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లారన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో వచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, ఆశా వర్కర్ల వ్యవస్థ గ్రామీణ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చివేసిందని గుర్తు చేశారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చిందన్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందిస్తూ గుండె, కిడ్నీ వంటి ఖరీదైన జబ్బులకు సైతం పేదవాడు ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌ల్లో చికిత్స పొందేలా ఈ పథకం అండగా నిలిచిందన్నారు. వైద్య రంగంలో వస్తున్న టెక్నాలజీ, టెలిమెడిసిన్, సరికొత్త పరికరాలు కేవలం కార్పొరేట్ వర్గాలకే పరిమితం కాకుండా అట్టడుగు వర్గాలకు సైతం అందాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సైన్స్ అనేది సామాన్యుడికి, టెక్నాలజీ అనేది పేదవాడికి సేవ చేయాలన్నారు. వైద్య విధానం వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించే ఇల్‌నెస్ కేర్‌గా ఉండిపోకూడదని, వ్యాధి రాకుండా ముందే నివారించే వెల్‌నెస్ కేర్‌గా మారాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఐసీయూల కంటే వ్యాధి నివారణే అత్యంత చౌకైన మార్గమని వ్యాఖ్యానించారు తెలంగాణ నేడు దేశంలోనే పబ్లిక్ హెల్త్ క్యాపిటల్‌గా అవతరించిందని పేర్కొన్నారు. జిల్లా హాస్పిటల్స్ బలోపేతం, వైద్య విద్యాసంస్థల విస్తరణ, నర్సింగ్, పారామెడికల్ రంగాలను ప్రోత్సహించడం ద్వారా వైద్య రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. వైద్య రంగంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం అనేది వ్యాపార లాభాల కోసం కాక ప్రభుత్వ ఆశయాలకు ప్రైవేట్ రంగానికి ఉన్న నైపుణ్యాలను జోడించి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికే ఉపయోగపడాలని భట్టి స్పష్టం చేశారు. వచ్చే దశాబ్ద కాలంలో వైద్య రంగానికి అవసరమైన మానవ వనరులను, నైపుణ్యాలను అందించడానికి ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఉన్న బలమైన ఫార్మాస్యూటికల్ బేస్, మెడికల్ డివైజెస్ పార్క్, ఐటీ టాలెంట్, ప్రభుత్వ అండదండల వల్ల తెలంగాణ ప్రపంచంలోనే మెడికల్ ఎక్సలెన్స్ ఇకోసిస్టమ్‌కు కేంద్రంగా మారిందన్నారు. ఇక్కడినుంచే దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే సరికొత్త హెల్త్ కేర్ ప్రొటోకాల్స్, డయాగ్నోస్టిక్స్, డిజిటల్ ప్లాట్‌ఫాంలు రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




