– సబ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి తుమ్మల
– ఇప్పటికే మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్నతోపాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి, సబ్ కమిటీ సభ్యులకు రాష్ట్ర రైతుల తరపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మొక్కజొన్న, జొన్న పంటలను ప్రైస్ సపోర్టు స్కీం పరిధిలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్రం పలుమార్లు కోరినప్పటికీ ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా మొక్కజొన్న, జొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు బహిరంగ మార్కెట్‌లో లభించిన ధరలకే తమ పంటను అమ్ముకుంటున్నారని మంత్రి తెలిపారు. అయితే తెలంగాణలో మాత్రం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకొచ్చి పంటలను కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాసంగి సీజన్‌లో 278 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులకు నష్టం కలగకుండా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వద్ద కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఖరీఫ్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.76 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రూ.902.80 కోట్ల వ్యయం భరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులు తమ జొన్న పంటను మార్కెట్లకు తీసుకురావడం ప్రారంభించిన నేపథ్యంలో మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న తరహాలోనే జొన్న పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల జొన్న రైతులకు గణనీయమైన ఆర్థిక భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో రాష్ట్రంలో మొక్కజొన్న పంటను సుమారు 11.21 లక్షల ఎకరాలలో సాగు చేయగా అనుకూల వాతావరణ పరిస్థితులతో ఎకరానికి సగటు 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు తెలిపారు. అలాగే జొన్న పంటను 3.68 లక్షల ఎకరాలలో సాగు చేయగా ఎకరానికి సరాసరి క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటల కొనుగోళ్ల కోసం దాదాపు రూ.6000 కోట్ల” వ్యయం చేసినట్లు మంత్రి తెలిపారు. రైతుల ఆదాయ భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం నుండి సహకారం లేకపోయినా రైతులను కష్టాల్లో వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోళ్లు నిర్వహిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ నిర్ణయం రైతులకు మరింత ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల, సివిల్ సప్లయిస్ శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





