చాగంటి తులసి కథా విశ్లేషణ – 3

యాష్ ట్రే వంటి మంచి కథలు రాసిన రచయిత, అనువాదం, విమర్శ, నాటకం, పరిశోధన రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్య ఉద్యమశీలి- చాగంటి తులసి తొంభయ్యవ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా తిరునగరి దేవకీదేవి రాసిన విమర్శనాత్మక వ్యాసాన్ని మూడు వారాల పాటు శోభ పాఠకుల కోసం ప్రచురిస్తున్నాము.

-తిరునగరి దేవకీదేవి

–         శోభ టీమ్  

తరాలు మారుతున్నప్పుడు ఆలోచనలు మారుతై. అలవాట్లూ మారుతై. అది సహజం. మరీ ముఖ్యంగా ఈ గ్లోబలైజేషన్లో వాటివేగం ఎక్కువైంది. కానీ మనుషులు వయసు మీదపడుతున్నకొద్దీ తమవారిమీదే కాదు తమ వస్తువులమీద మమకారం పెరుగుతుంది. చాలావరకు ఆ వస్తువు పనికిరాకపోయినా పడేయడానికి ఇష్టపడరు. ఇంటి పెద్దమనిషి పెద్ద ఆరామ్ చైర్ పై మమకారంతో ఊరినుండి తెచ్చుకున్నాడు. దాన్లో కూచోవడం ఆయన సౌకర్యంగా ఫీలౌతున్నాడు. కానీ ట్రెండ్ మారి సోఫాసెట్లు తమహంగులను ప్రదర్శించినై. సహజంగానే పిల్లలు వాటిని తమఇళ్ళలో సెట్ చేసుకుంటారు. అదే వడదెబ్బ కథలోనూ జరిగింది. తండ్రి ఎండలో బయట తిరిగి వచ్చేవరకు కొడుకూ కోడలు తెచ్చిన సోఫాసెట్లను సెట్ చేస్తూ తండ్రి కుర్చీని పక్కన పడేయడం, అది తెలిసి తనకు శక్తి ఉందా లేదా అని పట్టించుకోకుండా ఆ పెద్దమనిషి అమాంతంగా దాన్ని హాల్లోకి వేసుకోవడం వరకు బాగానే ఉంది. ఆయనకు దానిమీది మమకారంతో పాటు తనకుర్చీకి స్థానబ్రంశం కల్పించడం ఉక్రోశం కలిగింది. అది మానసికం. కుర్చీని కిందికి తీసుకురావడంలో గుండెకు భారమైంది. అన్నీ కలగలిసి ఠపీమన్నాడు. జనం దాన్ని వడదెబ్బ (సన్ స్ట్రోక్) వల్ల అనుకున్నా నిజంగా అది ‘son’ stroke. శ్లేషార్థంతో రాసిన కథ ఇది. పేషెన్స్. స్కూల్ పిల్లల్లో పోటీతత్వం, ఉడుకుమోత్తనం, మానసికస్థితిని బట్టి నిర్ణయాలుండటం, పెద్దలు కూడా ఓ స్థాయిలో పిల్లలుగా మారటం, పిల్లల మెదడు పెద్దలకన్నా చురుగ్గా పనిచేయడం వంటి విషయాలను ఈ కథలో చూడొచ్చు. కథలో ఆటపేరు పేషెన్స్.

అభ్యుదయ భావాలతో తల్లిదండ్రుల నెదిరించి కుటుంబ సంబంధాలను లెక్కచేయకుండా దళితుణ్ణి పెళ్ళి చేసుకున్న రచయిత్రి చిత్రకథ తిరోగామి. భర్త అభ్యుదయ భావాలు కలిగిఉండటం వల్లనే కులాన్ని పట్టించుకోకుండా అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరి మనోభావాలు ఒకటే అవడం వల్ల వాళ్ళ ఇల్లే సామాజిక సమస్యల చర్చావేదికగా మారడం సరే. ఆ స్త్రీ తన కూతురు స్వేచ్ఛను కూడా స్వాగతించింది. అంతవరకు బాగానే ఉంది. ‘‘నిన్న సాయంత్రం రచన పరుగుపరుగున వచ్చింది. దానివెంట ఓ కుర్రవాడు ఉన్నాడు. ఇద్దరూ చెయ్యీచెయ్యీ పట్టుకొని పరిగెత్తుతూ వచ్చారు. ఇద్దరు ఆడపిల్లలు చెట్టాపట్టాలేసుకుని పరిగెట్టుకొని వచ్చినట్టే వచ్చేరు.

ఓ లిప్తపాటు నేనే గతుక్కుమని నన్నునేను సర్దుకున్నాను.‘‘ అనుకున్న తండ్రికి- కూతురు రచన క్రితంరోజు పిక్నిక్ వెళ్తూ వచ్చి డబ్బులకోసం అడిగి ఆ రోజు ఉదయం చీకటితోనే వెళ్ళి తొమ్మిదైనా ఇల్లు చేరుకోకపోవడంతో కుర్రవాడి సహవాసంతో పాటు రాత్రివరకు రాకపోవడం ఎన్నో ఆలోచనలు ఆందోళన కలిగించినై. చూసిచూసి బస్టాండ్ కు వెళ్ళివచ్చేవరకు తల్లీకూతుళ్ళు నవ్వుతూ కొడుకేమో మొహం మాడ్చుకొని భోజనం చేస్తున్న సీన్. ఆమె- చీకటితోనే పిక్నిక్ పోయిన కూతురు గురించి బెంగపడలేదు కాని సాయంకాలం భజనకు పోయిన కొడుకు పెడమార్గం పడుతున్నాడని ఆందోళన. తండ్రికి మాత్రం కూతురు గురించి ఆలోచన. ఆమెకు కూతురుపట్ల విశ్వాసం. కాని కొడుకు అభ్యుదయమార్గం కాక ఆధ్యాత్మికమార్గంలో పడుతున్నాడని ఆవేదన. ఇందులో తండ్రికి కూతురిపట్ల విశ్వాసం లేకపోవడం తిరోగామి లక్షణమా? అభ్యుదయ వాతావరణంలో పెరిగిన కొడుకు ఆధ్యాత్మికం వైపు దృష్టి మళ్ళించడం తిరోగామి లక్షణమా? అన్నవి చర్చకు వచ్చే అంశాలు.

ఒంటరి మహిళలను చూసే కొందరు ఇల్లాండ్రు తమభర్తలకు వల వేస్తున్నారేమోనని అపోహ పడుతుంటారని చెప్పేకథ శరణ్యం. సముద్రతీరాల్లో నివసించేవారంతా చితికిన అతుకులబతుకుల వాళ్ళే. ప్రభుత్వం పెట్టుబడిదారుల ఉన్నతికోసం వాళ్ళగుడిసెలపై కన్నేసి వాటిని కూల్చాలని ఎట్లాగూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. వాళ్ళు పనిదొరక్క నానాఅవస్థలు పడటం మామూలే. ప్రకృతి విలయం దినదినగండమే. వరద రాగానే అంతా కుండామండా సర్దుకొని బయటపడ్డా ముచ్చటపడి కొనుక్కున్న సత్తుబిందె కోసం వెనక్కిపోయిన ఆమె చనిపోయింది. భార్యకోసం ఆరాటపడ్డ భర్తచేత  ఆమె చని పోయిందనే నిర్ణయంలో స్వర్గారోహణ చేసిందని తమ బతుకులన్నీ నరకంలో ఉన్నాయని ప్రకటింప చేస్తుంది రచయిత్రి.  అది యదార్థం కూడా.

ఈమె కొన్ని కథల్లో విజయనగరం మాండలికం పరిచయమవుతుంది.అప్పగింతలపాట శైలి వైవిధ్యంగా కనపడుతుంది. పేషన్స్ కథద్వారా పేషెన్స్ అనేఆట కూడా ఉంటుందనే విషయం తెలుస్తుంది. మొత్తంగా ఈ కథాసంపుటిలో మధ్యతరగతి కుటుంబాలు ఆడపిల్ల చదువుపట్ల ఆసక్తి చూపించలేదని, పెళ్ళే పరమావధిగా చూసిన సందర్భాలు కొన్నైతే, ఆర్థికపరిస్థితులు ఆ పెళ్ళిపట్ల ఉదాసీనత వహించే పరిస్థితులు లేకపోలేదని, మరికొన్నిసార్లు ఆడపిల్లల జీవితంకన్నా స్వార్థంతో ప్రవర్తించిన కుటుంబాలు ఉంటాయని, ఆడపిల్లల పెళ్ళిల్లలో ఆర్థికత ప్రధానపాత్ర వహించిందని, ప్రైవెటేజేషన్ మధ్యతరగతి కుటుంబాలను ఎదుగూబొదుగు లేకుండా చేసిందని, మారుతున్నతరాల నాగరికతను పెద్దలు స్వాగతించ లేకపోవడం, అణగారిన జీవితాలకు చావే పరిష్కార మార్గమని, మధ్యతరగతి కుటుంబాలు పరువు మర్యాదలంటూ వైవాహిక బంధాలలో  తమ అభిమతానికి వ్యతిరేకమైన జీవితాన్ని ఈడుస్తారని రచయిత్రి అభిప్రాయపడ్డారు. రచయిత్రి తానురాసిన కథలు కాలానుగుణంగా వచ్చినమార్పులు వరుసక్రమంలో ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. కాని ఆమెరాసిన రెండోకథనే పెద్ద విప్లవాత్మక కథ.

(వ్యాసం ముగిసింది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *