– బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
– మూడు రాష్ట్రాల్లో విజయంతో బీజేపీ సంబరాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారీగా సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కలిసి స్వీట్లు పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అసోం, బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి విజయం సాధించడం ఆనందకరమన్నారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలనలో జరిగిన అరాచకాలు, అవినీతి, చొరబాటుదారులకు ప్రోత్సాహం ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే జరిగినవని, ఈసారి ప్రజాశక్తి ఏంటో చూపించి అరాచక పాలనకు చెక్ పెట్టారని తెలిపారు. ఈ ఎన్నికలను విశ్లేషిస్తే పన్నెండేళ్లుగా మోదీ ప్రభుత్వ అభివృద్ధి అజెండాకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వివక్ష లేకుండా పేదలను పేదలుగానే పరిగణించడం వల్లే ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఇపుడు తెలంగాణ ప్రజల్లో కూడా మోదీ పట్ల అమిత ఆసక్తి కనిపిస్తోందని, అభివృద్ధినే వారు కోరుతున్నారని అన్నారు. గత పదేళ్లుగా బీఆరఎస్, రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ రాష్ట్ర సంపదను దోచుకున్నాయని ఆరోపించారు. అభివృద్ధి, పారదర్శక సంక్షేమ పథకాలు అమలు చేసిన రాష్ట్రాల్లో ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చారు. అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో ప్రో-ఇన్‌కంబెన్సీ ఓటు రావడం దీనికి ఉదాహరణ. అదే సమయంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, లెఫ్ట్ పాలిత ప్రాంతాల్లో అవినీతి, బంధుప్రీతి, మంత్రుల అరెస్టులు వంటి ఘటనలు ప్రజల ముందుకు వచ్చాయన్నారు.
ప్రధాని పర్యటనతో రాష్ట్రంలో పెను మార్పులు
ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజల్లో ఆకాంక్ష నెలకొందన్నారు. ఆ లక్ష్యంతో, కృతనిశ్చయంతో పార్టీ పనిచేస్తోందన్నారు. గత 12 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సుమారు రూ.15 లక్షల కోట్ల కేటాయించిందని, రైల్వేలు, జాతీయ రహదారులు, ఎయిమ్స్, గిరిజన విశ్వవిద్యాలయం వంటి అనేక ప్రాజెక్టులు వచ్చాయని, ఈ అభివృద్ధి వల్లే ప్రజల్లో మోదీ పట్ల మరింత సానుకూలత పెరిగిందని చెప్పారు. సికింద్రాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చి ఆశీర్వదించాలని కోరారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చి అది మోదీకి మనం అందించే గొప్ప కానుకగా మారాలని విశ్వసిస్తున్నానన్నారు. బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మించిన పశ్చిమ బెంగాల్‌లో ఆయన కలలుగన్న దిశగా ఈరోజు ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారం సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. 2011లో ఒక్క సీటు కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు టూ-థర్డ్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి రావడం అక్కడి ప్రజలు మోదీ నాయకత్వాన్ని ఎంతగా విశ్వసించారో స్పష్టంగా చూపిస్తోందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



