– సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి
– ఆయుష్ విద్యార్థుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : ప్రజారోగ్య పరిరక్షణలో అల్లోపతి వైద్యులతో సమానంగా అహర్నిశలు సేవలందిస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ విషయంలో తీవ్ర వివక్ష చూపడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంరద్ రావు విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగానే ఆయుష్ పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లకు అల్లోపతితో సమానంగా స్టైఫండ్‌ను పెంచి పెండింగ్ ఎరియర్స్ సహా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎర్రగడ్డ డాక్టర్ బి.ఆర్.కె.ఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హాస్పిటల్ ప్రాంగణంలో స్టైఫండ్ పెంపు కోరుతూ 16 రోజులుగా నిరసన తెలుపుతున్న ఆయుష్ (ఆయుర్వేద, యునాని, హోమియోపతి) పీజీ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్ల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని రామచందర్ రావు సందర్శించి బీజేపీ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద, యునాని, హోమియోపతి వంటి భారతీయ వైద్య విధానాల్లో సేవలందిస్తున్న పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లకు కొన్నేళ్లుగా ప్రభుత్వాలు స్టైఫండ్ పెంచకుండా అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో 2006 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భారతీయ వైద్య రంగం (ఆయుష్), అల్లోపతి వైద్య విద్యార్థులను సమానంగా చూడాలనే నిబంధన ఉందని గుర్తు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి ఈ స్టైఫండ్లను నిలిపివేయడం శోచనీయమన్నారు. అల్లోపతి వైద్య విద్యార్థుల మాదిరిగానే ఆయుష్ పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఇంటర్న్‌షిప్ చేస్తున్న వారికి సమానంగా స్టైఫండ్ చెల్లించాలని న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని పేర్కొన్నారు. పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం ఆయుష్ పీజీ విద్యార్థులకు నెలకు రూ.60 వేలు, హౌస్ సర్జన్లకు రూ.25 వేలు చొప్పున స్టైఫండ్ చెల్లిస్తుంటే తెలంగాణలో మాత్రం పీజీ విద్యార్థులకు కేవలం రూ.30 వేలు, హౌస్ సర్జన్లకు రూ.13 వేలు మాత్రమే ఇవ్వడం తీవ్ర వివక్షాపూరితమని ఆయన మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం అమలు చేస్తున్న నిబంధనలను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయుష్ వైద్యులకు సమాన స్టైఫండ్ అమలు చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేసిన నేటి ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న ఎరియర్స్ సహా ఏపీ తరహాలో పూర్తిస్థాయి స్టైఫండ్‌ను తక్షణమే చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు 16 రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియా, భూ ఆక్రమణలపైనే దృష్టి సారిస్తూ ప్రజా సేవ చేసే వైద్య విద్యార్థుల సమస్యలను, విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆయుష్ విద్యార్థులకు అల్లోపతితో సమానంగా స్టైఫండ్ పెంచి, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని రామచందర్ రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





