– ఫిలిప్పీన్స్‌లో ఎన్నారై అడ్వైజరీ కమిటీ పర్యటన
– మనీలాలో కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ అధికారులతోనూ భేటీ
– ఉత్తమ వలస విధానాలపై చర్చలు
– ప్రభుత్వ విప్ శ్రీనివాస్, ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ బృందం సభ్యులు బుధవారం ఫిలిప్పిన్స్ దేశ రాజధాని మనీలాలోని ఇండియన్ ఎంబసీని సందర్శించారు. తర్వాత మనీలాలోని కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ ఉన్నతాధికారులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ వలస విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫిలిప్పీన్స్ దేశ వలస విధానాన్ని ఆ దేశ ఉన్నత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వలస విధానాన్ని అమలు చేస్తున్న ఫిలిప్పీన్స్ దేశంలో అమలులో ఉన్న విధి విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇదే తరహా మెరుగైన వలస విధానాన్ని గల్ఫ్ కార్మికుల కోసం అమలు చేసేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి వెల్లడించారు. మనీలాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అంబసడర్ హర్ష కుమార్ జైన్, ఫస్ట్ సెక్రటరీ నీలేష్ కుమార్ రాయ్ లతో వలస కార్మికుల విధానాల అంశాలపై కమిటీ సభ్యులు సుధీర్ఘంగా చర్చించారు. గల్ఫ్ కార్మికులను సంక్షేమం కోసం ఫిలిప్పీన్స్ తరహా విధానాలను అమలు చేస్తామన్నరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నారై అడ్వైజరి కమిటీ ఫిలిప్పీన్స్ దేశంలో పర్యటిస్తోంది. ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, ప్రొఫెసర్లు విజయ్ కొర్ర, శ్రీనివాస్ జునుగురు, లైజన్ ఆఫీసర్ ఆది కార్తీక్, తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు