– ట్యాంపరింగ్‌కు అవకాశం లేని కొత్త స్మార్ట్ రేషన్ కార్డు
– రేపు సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా విడుదల
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారుతోంది. పంద్రాగస్టును పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో శనివారం స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్డులు అందచేస్తారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలించారు. 12 ఏళ్లకు పైగా జిరాక్స్ కాగితాలే రేషన్ కార్డులుగా ఉపయోగపడుతుండగా అవి చినిగిపోతూ ఇబ్బందిపడుతున్న లబ్దిదారులు రేషన్‌కార్డులు ఎప్ప్పుడెప్ప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంద్రాగస్టు రోజు నుంచి సరికొత్త హంగులతో పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించడానికి శ్రీకారం చుట్టింది. సంగారెడ్డిలో సీఎం లాంఛనంగా ప్రారంభించిన వెంటనే లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ట్యాంపరింగ్ చేయడానికి వీలులేని విధంగా ఏటీఎం, పాన్‌కార్డు మాదిరిగా డిజిటలైజేషన్, స్మార్ట్ టెక్నాలజీ ఆధారితంగా పంపిణీ చేసే పీవీసీ కార్డు, చిప్, బార్‌కోడ్, డిజిటల్ వెరిఫికేషన్ వంటి టెక్నాలజీతో స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించారు. కార్డు స్కాన్ చేయడంతో అందులో ఉన్న కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం వస్తుంది. ఇప్పటికే బయోమెట్రిక్ ద్వారా ఏ రేషన్ దుకాణంలో అయినా సరకులు పొందే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్మార్ట్ కార్డు ద్వారా రాష్ట్రంలోని ఏ రేషన్ దుకాణంలోనైనా సరకులు పొందడం సులువు అవుతుంది. క్యూఆర్ కోడ్ ఉండడంతో కార్డులు డూప్లికేట్ అయ్యే అవకాశం ఉండదు. జిల్లాల్లో ప్రస్తుతం రేషన్ పొందుతున్న లబ్దిదారులు రేషన్ షాప్‌లో పాత కార్డు చూపించి స్మార్ట్ కార్డు పొందవచ్చు. అంతేకాక టీఎసఈపాస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని కూడా స్మార్ట్ కార్డు తీసుకునే వీలు కల్పించారు. స్మార్ట్ రేషన్ కార్డులు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటో, రేషన్ కార్డు నంబర్, రేషన్ దుకాణం నంబర్ ముద్రిస్తారు. కార్డు వెనక కుటుంబ సభ్యుల వివరాలతోపాటు ఇతర అవసరమైన సమాచారాన్ని పొందుపరిచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





