– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– పలువురు ప్రముఖులకు ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాల ప్రదానం
– ఇందిరా గాంధీ హయాంలో వ్యవసాయాభివృద్ధిపై పుస్తకావిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : సాగు బాగుంటేనే సుభిక్షమైన తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాలనేదే తమ లక్ష్యమన్నారు. వ్యవసాయ రంగంలో బహుముఖ సేవలు అందించిన ప్రముఖులకు ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో గురువారం అందజేశారు. వ్యవసాయ రంగానికి సేవలు అందించిన శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, రైతులను రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ ఎం.సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ ఎస్.డి.శిఖామణి ((వ్యవసాయ శాస్త్రవేత్తలు), దిలీప్ రెడ్డి (పాత్రికేయుడు), లోనావత్ శాంతాబాయి (గిరిజన రైతు), కె.లావణ్య (సేంద్రియ రైతు) ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాలు అందుకున్నారు. ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ వ్యవసాయభివృద్ధికి అందించిన చేయూత, ఆ కాలంలో సాగు రంగంలో చోటుచేసుకున్న అభివృద్ధిపై రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు కె.వి.ఎన్.రెడ్డి, ఎం.భవాని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





