– 18l ఒక్క రోజే 6 లక్షలకు పైగా కూలీలకు ఉపాధి
– కూలీల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు
– గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
– ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్
– అటవీ శాఖ సమన్వయంతో ఏజెన్సీ ల్లో చెక్‌డ్యాంలు, ఊటకుంటల నిర్మాణం
– జలసిరి పనులు, గ్రామీణ మౌలిక వసతుల నిర్మాణాలపై సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : ఉపాధి హామీ పనుల అమలులో రాష్ట్రంలో కూలీల హాజరు గణనీయంగా పెరుగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ఈనెల 18న ఒక్కరోజే 6 లక్షలకు పైగా కూలీలు పనులకు హాజరవ్వగా నవంబర్ సీజన్లో ఇది ఇప్పటివరకు అత్యధికం. బుధవారం ఆరు లక్షలకు మించి కూలీలకు ఉపాధి కల్పించిన నేపథ్యంలో ఇదే ఒరవడిని కొనసాగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల పరిధిలోని వివిధ కార్యక్రమాల పురోగతిపై మంత్రి డాక్టర్ సీతక్క సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, జలసిరి, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నవంబర్‌లో రోజువారీ సగటు కూలీల హాజరు 5.97 లక్షలకు చేరిందని అధికారులు వివరించారు. ప్రస్తుతం రోజుకు ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి సగటున 47 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారని, ఆ సంఖ్యను 60కి పెంచేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
మేట్ల నియామకాన్ని వేగవంతం చేయాలి
ఉపాధి కోరే ప్రతి ఒక్కరికీ పని కల్పించడంతోపాటు కూలీల సంఖ్యను మరింత పెంచేందుకు మేట్ల నియామకాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న మేట్లకు డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టాలన్నారు. అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ అటవీ ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు, ఊటకుంటల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ పనుల ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంపొందించడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. ‘జలసిరి’ కింద చేపట్టిన పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఇప్పటివరకు 88,675 పనులు ప్రారంభమయ్యాయని, 28,646 పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. ఇందులో 6,755 పంట కుంటలు, 18 వేల ఇంకుడు గుంతల పనులు పూర్తయ్యాయి.. రెండు వేలకు పైగా బోరు బావుల రీచార్జ్ పనులు పూర్తి అయ్యాయని చెప్పగా మిగిలిన పనులను వేగవంతం చేసి లక్ష్యాలను చేరుకోవాలని మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోనూ జలసిరి పనులు చేపట్టేందుకు అనుమతి ఉన్నందున సంబంధిత శాఖల సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు.
గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ సమన్వయంతో చేపడుతున్న పనులపై మంత్రి సమీక్షించారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాలు, ధాన్యం నిల్వ గోదాములు, జీవనోపాధి వర్క్షెడ్లు, గ్రామీణ రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 5,118 పంచాయతీ భవనాలు, 5 వేల అంగన్వాడీ కేంద్రాల భవనాలు, 12,954 మహిళా సంఘాలు భవనాలు, 535 ధాన్యం నిల్వ గోదాములు, 635 జీవనోపాధి వర్క్షెడ్ల నిర్మాణాలతోపాటు వెయ్యి కిలోమీటర్ల మట్టి రోడ్లు, వెయ్యి కిలోమీటర్ల మెటల్ రోడ్లు, వెయ్యి ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. వాటి పనులను త్వరగా పూర్తి చేసి..ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. వీబీ–జీ రామ్ జీ కార్యక్రమం కింద గ్రామీణ నీటి వనరుల పునరుద్ధరణకు ఉన్న అవకాశాలను వినియోగించు కోవాలని సూచించారు. ఉపాధి హామీ ద్వారా కాలువల్లో పూడికతీత, మరమ్మతులు, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణ, చెరువుల్లో పూడిక తొలగింపు, వ్యర్థాల తొలగింపు, సహజ నీటి వనరులతో అనుసంధానం వంటి పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతోపాటు నీటి సంరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, అడిషనల్ కమిషనర్ రవీందర్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆరోగ్య సమావేశం మెటీరియల్ ఆవిష్కరణ
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన శిక్షణ కార్యక్రమంపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ ప్రత్యేక ఆరోగ్య సమావేశం (2వ ఎస్‌హెచ్‌జీ మీటింగ్) మెటీరియల్‌ను ఆవిష్కరించారు. ప్రతి నెలా 4 లక్షల 70 వేల మహిళా సంఘాల్లో ఆరోగ్యంపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం 18,500 గ్రామ సంఘాలకు, 540 మండల సమాఖ్యలకు, 32 జిల్లా సమాఖ్యలకు ఆరోగ్యం, పోషణ, ఆహారం, నీరు – పారిశుద్ధ్యం వంటి 18 అంశాలపై శిక్షణ మెటీరియల్ పంపిణీ చేస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





