డీలిమిటేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం!

లోక్‌సభ సీట్లు 50 శాతం పెంచే ప్రతిపాదన
2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్య వాటాకు రక్షణ
 మహిళలకు 33 శాతం కోటా అమలు దిశగా మళ్లీ రాజ్యాంగ సవరణ

దిల్లీ, నవంబర్‌ 27: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill)తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోమవారం, నవంబర్‌ 30న లోక్‌సభ తిరిగి సమావేశం కానున్న నేపథ్యంలో బిల్లును సభ ముందుకు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతున్నది. రాజ్యసభ డిసెంబర్‌ 2న సమావేశం కానుంది. ఏప్రిల్‌లో లోక్‌సభలో అవసరమైన మెజారిటీ సాధించలేకపోయిన కేంద్రానికి ఈసారి ఉభయ సభల్లో మద్దతు కూడగట్టడం కీలకం.
సీట్లు పెంపు, రాష్ట్రాల వాటాకు రక్షణ
అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచి, మొత్తం లోక్‌సభ స్థానాల్లో ఒక్కో రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న దామాషా వాటాను 2051 వరకు కొనసాగించాలని తాజా ప్రతిపాదన. రాష్ట్రాల శాసనసభల విస్తరణ కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తున్న ది . తాజా జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల పంపకాన్ని మార్చితే తమ ప్రాతినిధ్య వాటా తగ్గుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.

మహిళా కోటా అమలు ఎప్పుడు?

2023లో ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలను రిజర్వు చేసింది. ఆ చట్టం అమల్లోకి వొచ్చిన తర్వాత చేపట్టే తొలి జనగణన గణాంకాలు ప్రచురితమయ్యాక, వాటి ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే మహిళా కోటా అమల్లోకి వొస్తుంది. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికే కోటాను అమలు చేసే లక్ష్యంతో కేంద్రం మళ్లీ సవరణకు సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం

రాజ్యాంగంలోని 368వ అధికరణ ప్రకారం సవరణ బిల్లుకు ప్రతి సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి మించిన మద్దతు అవసరం. అదే సమయంలో సభకు హాజరై వోటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది అనుకూలంగా వోటు వేయాలి. ఏప్రిల్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు లోక్‌సభలో ఈ మెజారిటీని సాధించలేకపోయింది. రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య వాటాకు బిల్లు పాఠంలో ఎలాంటి హామీ ఇస్తారన్న అంశం ఈసారి చర్చలో కీలకం కానుంది.

తెలంగాణకు ఎన్ని సీట్లు?

తెలంగాణకు ప్రస్తుతం 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రానికి అదనంగా ఎన్ని స్థానాలు దక్కుతాయి, కొత్త నియోజకవర్గాల సరిహద్దులను ఎలా నిర్ణయిస్తారన్నది తాజా బిల్లు పాఠం, తదుపరి పునర్విభజన ప్రక్రియతో స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాల పెంపుపై 2025లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2026 తర్వాత చేపట్టే తొలి జనగణన సంబంధిత గణాంకాలు ప్రచురితమయ్యే వరకు ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ పునర్విభజన చేపట్టలేమని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *