ప్ర‌భుత్వ చొర‌వ‌పై ప్ర‌చారం చేయండి

– ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాల్లో పాల్గొనండి
– సమ్మె విరమణపై పార్టీ కేడర్‌కు మంత్రి పొన్నం పిలుపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ఆర్టీసీ కార్మికుల అంశాలపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ మొత్తం సంబరాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, అధికార ప్రతినిధులతో రవాణా, బీసీ ఆయన శనివారం జూమ్ సమావేశం నిర్వహించారు. రెండు రోజుల సమ్మెలోనే పలుమార్లు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి కార్మికుల చిరకాల స్వప్నం అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, 11 శాతం పీఆర్సీ ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారితో పార్టీ కేడర్ కలిసి సంబరాల్లో పాల్గొనాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల బృందం సుమారు 15 గంటలు చర్చించి పరిష్కరించి సమ్మె విరమింప చేసిందన్నారు. వారి ప్రధాన డిమాండ్స్‌కు ఒప్పుకోవడమేగాక మిగతా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టామని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో 55 రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, పైగా 30 మందికిపైగా కార్మికులు మరణించారని చెప్పారు. కార్మికులతో మనకు శతృత్వం లేదు.. వారు మన కుటుంబ సభ్యులు అని పొన్నం పేర్కొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ శవ రాజకీయాలు చేయడం సరైంది కాదని, సమ్మె వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్‌లు వ్యవహరించిన తీరు మంచిది కాదని అన్నారు. ఆర్టీసీ సమ్మె విరమణకు ప్రభుత్వం తీసుకున్న చొరవపై కాంగ్రెస్ పార్టీ సంబరాలు నిర్వహించాలన్నారు. పార్టీ ఎజెండాగా తీసుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ లు, అధికార ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లి మనం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వివరించాలని కోరారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు 2013 బాండ్స్, 2017 పీఆర్సీ, డీఏలు ప్రకటన, సీసీఎస్, పీఎఫ్ బకాయిల చెల్లింపు, కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు, కారుణ్య నియామకాలు, సర్వీసు నుండి తొలగించిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం చేశామని వివరించారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారని, పేదలకు విద్య వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ఆర్టీసీ లైఫ్ లైన్‌లాగా పనిచేస్తున్నదని మంత్రి పొన్నం చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *