కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

– హిట్లర్ పాలనలో రియల్ ఎస్టేట్ ఢమాల్
– లక్షల మంది పొట్టగొట్టిన రేవంత్
– కేసీఆర్ పాలనలో ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చాం
– బీఆర్ఎస్ చేవెళ్ల సర్వసభ్య సమావేశంలో కేటీఆర్

చేవెళ్ల, ప్రజాతంత్ర, జూన్ 25 : కాంగ్రెస్ పరిపాలనా కాలం సగం అయిపోయింది.. రెండున్నరేళ్లకే రియల్ ఎస్టేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సంక్షోభంలోకి నెట్టి లక్షల మంది ఉపాధి పోగొట్టిండు అని బీఆర్   ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. చేవెళ్లలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి ‘సర’ శిక్షణ, బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఒకప్పుడు వెనకబడిన చేవెళ్ల ప్రాంతానికి కేసీఆర్ హయాంలో, గత ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చామని, చందన్వెల్లి, సీతారాంపూర్‌లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశామని, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వెల్స్‌పన్ వంటి కంపెనీలను తీసుకొచ్చి వేలాదిమందికి ఉపాధి అందించామని వివరించారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్న రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గుని పాలనలో వేలాదిమంది ఇండ్లను కూలగొడుతున్నారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని, వాటిని గుర్తుంచుకొని సరైన సమయంలో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు బంధు ఆపేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రైతు బంధు ఆపడానికి దివానగాళ్లమా? దిమాగ్ లేదా మాకు? అని అన్నాడు.. మరి ఈరోజు తెలివి లేకనే రైతు బంధు ఆపిండా అని ప్రశ్నించారు. రైతు బంధు బంద్ అయింది.. రాహుల్ బంధు ప్రారంభమైంది అని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి చెప్పి తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. గత ప్రభుత్వంలో చేసిన ప్రతి ఒక్క రూపాయి అప్పు అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు చేశామంటూ మరి రేవంత్ రెడ్డి చేసిన రూ.4 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఇక్కడి డబ్బుల కట్టలతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు దిల్లీకి వరుస కట్టిర్రు.. తెలంగాణలో బ్రహ్మాండంగా ఆర్ఆర్ టాక్స్ కొనసాగుతున్నదన్నారు. చేవెళ్ల వేదిక మీదుగా ఎస్సీ, ఎస్టీ సోదరులకు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చిర్రు.. దళిత బంధు ద్వారా రూ.12 లక్షలు ఇస్తామన్నారు.. ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు లేకపోతే జాగతోపాటు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు.. అని కేటీఆర్ గుర్తు చేస్తూ వాటిని అమలు చేయకుండా అందరినీ మోసం చేశారని ఆరోపించారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఉన్న అసైన్డ్ భూములను దళిత, గిరిజనుల నుంచి కాంగ్రెస్ గుంజుకుంటోందన్నారు. ఇన్ని అరాచకాలు, అక్రమాలు, అవినీతిని చూశాక ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అంటున్నారని చెప్పారు. ఖచ్చితంగా కేసీఆర్‌ని మరోసారి ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించాలంటే కార్యకర్తలంతా కష్టపడాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమాలతోనే ఆ దిశగా మన పనిని ప్రారంభించాలన్నారు. వచ్చే అయిదేళ్లలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తాను తీసుకుంటానని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా, రాజకీయంగా అన్ని అవకాశాలు వచ్చేలా హామీ ఇస్తున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, పట్లొల్లా కార్తీక్ రెడ్డి, షాబాద్ మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, చేవెళ్ల సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి రాంబాబు యాదవ్, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *