– కాంగ్రెస్, బీఆర్ఎస్లపై బీజేపీ చీఫ్ రామచందర్ ధ్వజం
– ఎస్ఐఆర్ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ
– ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచడానికేనని స్పష్టీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమైన ఎసఐఆర్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. రాజ్యాంగబద్ధమైన, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగే ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు.ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటికే పదిసార్లు ఈ ప్రక్రియ నిర్వహించారని, అప్పట్లో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్లు అనవసర భయాందోళనలు సృష్టిస్తూ ఓట్లు తొలగిస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఒకవైపు ఈ పార్టీలు ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూనే మరోవైపు ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులను, బీఆర్ఎస్ తన పార్టీ నేతలను ఈ ప్రక్రియలో సీరియస్‌గా పాల్గొనాలని సూచించడం వారి ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందన్నారు. ఈ ప్రక్రియలో పనిచేస్తున్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవారేనని, వారు ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి పూర్తిస్థాయి తనిఖీ అనంతరం ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేస్తారని చెప్పారు. ఏ సమాజానికి, ఏ నిజమైన భారతీయ పౌరుడికి వ్యతిరేకం కాదని, ఇది కేవలం డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లు, మరణించిన ఓటర్ల పేర్లు, అక్రమ నమోదు వంటి అంశాలను గుర్తించి తొలగించడానికి మాత్రమే ఉద్దేశించినదని రామచందర్‌రావు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారైనా సరే వారు భారతీయ పౌరులైతే ఓటరుగా నమోదు చేసుకునే పూర్తి హక్కు ఉందన్నారు. ఒక వ్యక్తి ఒకేచోట మాత్రమే ఓటరుగా నమోదు కావాలని, ఒకటి కంటే ఎక్కువచోట్ల నమోదు చట్టరీత్యా తప్పు, శిక్షార్హం అని హెచ్చరించారు. బీఆరఎస్ పార్టీ ఎసఐఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఆ పార్టీ తన కేడర్ బలం, బూత్‌స్థాయి నెట్‌వర్క్‌ను గణనీయంగా కోల్పోవడమేనన్నారు. ఒకవేళ ఎస్ఐఆర్ వల్ల బీజేపీకే లాభం జరుగుతుందని భావిస్తే కేరళం వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా విజయం సాధించిందో సమాధానం చెప్పాలన్నారు. బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఈ ప్రక్రియలో అసలైన ఓట్లు మాత్రమే నమోదయ్యేలా అందరం బాధ్యతగా వ్యవహరించాలని పార్టీ బీఎలఏ ప్రతినిధులను, ప్రజలను ఆయన కోరారు. అలాగే బంగ్లాదేశ్ లేదా రోహింగ్యా చొరబాటుదారుల విషయంలో ఎక్కడైనా అనుమానాస్పద నమోదు కనిపించినట్లయితే వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
దేశంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీకి నేటితో 51 సంవత్సరాలు పూర్తయ్యాయని, అందుకే దీనిని ‘సంవిధాన్ హత్యా దివస’గా జరుపుకుంటున్నామని రామచందర్‌రావు తెలిపారు. 1975లో ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అణచివేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు జైలుపాలయ్యారని, వారు ఆనాటి ప్రజాస్వామ్య పరిరక్షకులని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కే.అద్వానీ, మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్ నారాయణ్ సహా అనేకమంది నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపిందని తెలిపారు. ఈ తరం యువత ఎమర్జెన్సీ చీకటి రోజులను తప్పకుండా తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ ముందుగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని ఎలా అవమానించిందో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ఎమర్జెన్సీ సమయంలో 2.2 లక్షల మందిని జైలులో పెట్టారని, 35 వేల మందిని మీసా కింద నిర్బంధించారని, సంజయ్ గాంధీ హయాంలో బలవంతపు స్టెరిలైజేషన్లు, ఇండ్ల కూల్చివేతలు వంటి అమానుష చర్యలు జరిగాయని గుర్తు చేశారు..మీడియాపై సెన్సార్ విధించి పత్రికల స్వేచ్ఛను పూర్తిగా అణచివేశారన్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర రిజర్వేషన్ల విషయంలో వెనుకబడిన వర్గాలకు ఎప్పుడూ అనుకూలంగా లేదని, గిరిజనులక” రావాల్సిన రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్ల వల్ల నిలిచిపోయిన విషయం అందరికీ తెలుసునని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




