– రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్ తదితర ఉన్నతాధికారులతో సీఎస్ సోమవారం సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక రంగానికి రైల్వే కనెక్టివిటీ అత్యంత కీలకమని సీఎస్ తెలిపారు. సుమారు రూ.50,870 కోట్ల అంచనా వ్యయంతో 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి 2,023 కిలోమీటర్ల మేర విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రైల్వే బోర్డుకు సమర్పించినట్లు అధికారులు సీఎస్‌కు వివరించారు.
సమీక్షలోని ముఖ్యాంశాలు
రైల్వే అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్లు, రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు, చర్లపల్లి రైల్వే స్టేషన్ కనెక్టివిటీ వంటి 21 కీలక అంశాలపై అధికారులతో సంయుక్త తనిఖీలు చేసి పరిష్కరించాలని సీఎస్ సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫ్యూచర్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో రైల్వే లైన్ల విస్తరణ, కొత్త టెర్మినల్స్ ఏర్పాటు, బుల్లెట్ ట్రైన్ మార్గాలకు అవసరమైన భూసేకరణపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పీఎం గతిశక్తి పథకం కింద నిధులు పొందేందుకు అవసరమైన సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, 15 జిల్లాల కలెక్టర్లు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





